ఒక వేళ పవన్ సినిమాల్లోకి రాకపోయుంటే..!
- IndiaGlitz, [Sunday,December 15 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని.. పవర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నిలిచి.. ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను’ అంటూ రీల్ డైలాగ్‌ను కాస్త రియల్ లైఫ్‌లోనూ సెట్ చేసేశాడు. ఎన్నో సూపర్ హిట్‌లు.. మరెన్నో సామాజిక స్పృప కల్పించే సినిమాలను తెరకెక్కించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త అటు ఇటు.. అన్నయ్య చిరంజీవి రేంజ్‌కు చేరుకున్నాడు తమ్ముడు. మరోవైపు దాదాపు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం పవన్ రాణించలేకపోయారు. కోట్లాది మంది అభిమానులున్నప్పటికీ రెండు చోట్ల పోటీచేసినా ఫలితం లేకపోయింది.. రెండు చోట్లా అది కూడా ఒక పార్టీకి అధినేతగా ఉండి ఓటమిపాలవ్వడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారేమో. అయితే ఒక వేళ పవన్.. సినిమాల్లోకి రాకపోయుంటే ఏం చేసేవారు..? ఏ రంగంలో రాణించేవారు..? అనేది తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
ఈ స్థితికి వచ్చా..!
‘నేను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ వచ్చినా ఈ స్థితికి వస్తానని అస్సలే ఊహించలేదు. చిన్నప్పుడు మహా అయితే ఏ వ్యవసాయం చేస్తానో.. లేకుంటే నర్సరీ నడపడమో చేస్తానని అనుకున్నాను. మహా అంటే మా నాన్న గారి లాగా ఒక ఎస్సైగా జీవితాన్ని ప్రారంభించి గడిపేస్తామనో అనుకున్నాను. కానీ ఇలా కళారంగంలోకి వచ్చి ఈ స్థితికి వచ్చాను. అయితే నాకు చిన్నప్పుడు చదవుకునేటప్పుడు నువ్వు ఏది కావాలనుకుంటే అది చేయమనేవాళ్ళు. నాకు చదవడం ఇష్టమే కానీ, పరీక్షలు, మార్కుల చదువులు కాదు.. చదువు జ్ఞానం సంపాదించడానికే తప్ప, జ్ఞాపకానికి టెస్టులు పెట్టి, మార్కుల లెక్కల కోసం కాదని నా భావన’ అని పవన్ చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ కావాలని.. హీరోగా!
అయితే తాను.. పుస్తకాలు, కథలు బాగా చదువుతుండేవాణ్ణని ఈ విషయం గమనించిన అన్నయ్య చిరంజీవి.. పుస్తకాలు బాగా చదువుతుంటావ్ కదా! కథలు ఎలా చెప్పాలో, స్ర్కీన్‌ప్లే ఎలా రాయాలో నేర్చుకో’ అని బాగా ప్రోత్సాహించారని పవన్ తెలిపాడు. తాను కూడా దర్శకుడిని ఎందుకు కాకూడదు..? అని అనిపించిందని.. చివరికి నటుడిని అయ్యానన్నాడు. అప్పట్లో తనను నిర్మాత కె.ఎస్. రామారావు మాత్రం హీరోగా తెరపై పరిచయం చేయడమంటే ఇష్టమని.. అని చివరికి వెండితెరపై కనిపించానని పవన్ తన చిన్ననాటి నుంచి నటుడి స్థాయికి ఎదిగిన రోజుల వరకు జరిగిన పరిణామాలను ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ వేదికగా పవన్ గురించి కొత్త కొత్త విషయాలను మెగాభిమానులు తెలుసుకున్నారు.