Mohan Babu:నా పేరు వాడితే ఖబడ్దార్.. రాజకీయ నేతలకు మోహన్‌బాబు వార్నింగ్..

  • IndiaGlitz, [Monday,February 26 2024]

ఏపీ ఎన్నికల వేళ తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నారని నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. మీ మోహన్ బాబు అని రాసుకొచ్చారు.

కాగా ఇటీవల ఏపీ ఫిల్మ్ డెవల్‌పెమెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ మోహన్‌ బాబుది అయితే ఆయనను బెదిరించి చంద్రబాబు కుటుంబం లాక్కొందని ఆరోపించారు. దీంతో పోసాని వ్యాఖ్యలపైనే ఆయన ఇలా హెచ్చరికలు జారీ చేసి ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇదిలా ఉంటే మోహన్ బాబు కుటంబానికి ఏపీ సీఎం జగన్‌ కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీలోకి ప్రముఖ రాజకీయ కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది.
ఆయన పెద్ద కుమారుడు విష్ణు, వైఎస్ కుటుంబానికి చెందిన విరోనికా రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విరోనికా తండ్రి వైఎస్ సుధాకర్ రెడ్డి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు. దీంతో విష్ణుకు జగన్ బావ వరుస అవుతారు.

ఇక రెండో కుమారుడు మనోజ్ భూమా కుటుంబానికి చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం భూమా కుటుంబానికి ఉంది. మౌనిక సోదరి అఖిలప్రియ టీడీపీలో కీలకంగా ఉన్నారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. దీంతో ఏపీలో బలమైన రెండు పార్టీలతో మంచు కుటుంబానికి బంధుత్వం ఉంది. అందుకని తన పేరును ఎవరూ వాడుకోవద్దని సూచించారు.