CM Jagan:టార్గెట్ చంద్రబాబు.. కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
సొంత నియోజకవర్గం కుప్పంకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు.? ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అంటూ సీఎం జగన్ తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన ఆయన.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన సందర్భం అని చెప్పారు.
చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాడు ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే.. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసిందన్నారు. అలాగే మరో 2 రిజర్వాయర్లు ప్రారంభించేందుకు కూడా శ్రీకారం చుట్టామన్నారు .. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారని.. 14 ఏళ్లు సీఎంగా చేశారని.. అయినా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
కానీ మీ బిడ్డ జగన్.. కుప్పానికి కృష్ణమ్మ నీరు తెచ్చాడు... కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చాడు. రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చాడు.. చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించేలా ఏర్పాటు చేశాడని తెలిపారు. ఈ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ.1400 కోట్లను జమ చేశామని జగన్ వివరించారు. కుప్పంలో 87వేల కుటుంబాలు ఉండగా, ఇందులో 82వేల కుటుంబాలు ప్రభుత్వ పథకాలు అందాయన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్న భరత్‌ను ప్రజలు ఆశీర్వదించాలని జగన్ పిలుపునిచ్చారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను ఎన్నుకుంటే మంత్రి పదవి ఇస్తానని, తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని సభాముఖంగా ప్రకటించారు. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని స్పష్టంచేశారు. ప్రజలకు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకని ప్రశ్నించారు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోసం చేయడానికి తయారవుతారని విమర్శించారు. ఇంటింటికీ కిలో బంగారం, ఒక బెంజి కారు అంటారని.. అవసరానికి వాడుకుని ఆ తర్వాత వదిలేసే ఇలాంటి నాయకుడు కావాలా... చెప్పింది చేసే మీ బిడ్డ కావాలా? అంటూ కోరారు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన సమయం వచ్చిందని జగన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com