ఢిల్లీ: పూల మార్కెట్‌లో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన పోలీసులు
- IndiaGlitz, [Friday,January 14 2022]
రిపబ్లిక్ డే వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్‌లో శుక్రవారం ఓ అనుమానాస్పద బ్యాగ్ వున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఐఈడీ బాంబ్ కనిపించింది. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌కు తెలియజేయగా అక్కడికి చేరుకున్న సిబ్బంది బ్యాగును చెక్ చేసి బాంబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బాంబును నిర్మానుష్య ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీం బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం బ్యాగును ఓ పెద్ద మైదానానికి తీసుకెళ్లి ఎనిమిది అడుగుల లోతులో గొయ్యి తవ్వి పాతిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘాజీపూర్ పరిసర ప్రాంతాలను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అటు ఢిల్లీ పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు.
ఘాజీపూర్ పూలమార్కెట్‌ను ఖాళీ చేయించిన అధికారులు... ఇంకెక్కడైనా బాంబులున్నాయా అన్నదానిపై సోదాలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఐఈడీని స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా వెల్లడించారు. రద్దీగా ఉండే పూల మార్కెట్‌లో పాడుబడిన లెదర్ బ్యాగులో బాంబ్ ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనతో ఢిల్లీ అధికార వర్గాలు , కేంద్రం అప్రమత్తమైంది.