Download App

Iddari Lokam Okate Review

ప్రేమ క‌థాచిత్రాల‌ను తెర‌కెక్కించ‌డం క‌త్తి మీద సామే. సన్నివేశాల‌ను ఎంత కొత్త‌గా ఎలివేట్ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా రిజ‌ల్ట్ తేడా కొట్టేస్తుంది. ముఖ్యంగా ప్రేమ క‌థా చిత్రాల‌ను రీమేక్ చేసేట‌ప్పుడు నెటివిటీతో పాటు మ‌న ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఎమోష‌న్స్‌ను కూడా క్యారీ చేయాలి. ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప్రేమ క‌థా చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్‌, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేల‌తో ద‌ర్శ‌కుడు జి.ఆర్.కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ట‌ర్కీష్ సినిమా ఆధారం. మ‌రి ఈ రీమేక్ ల‌వ్‌స్టోరీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?  లేదా?  అనే విష‌యం తెలియాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

ఊటీలో ఓ హాస్పిట‌ల్‌లో అనుకోకుండా జ‌రిగిన యాక్సిడెంట్ వ‌ల్ల మ‌హి(రాజ్ త‌రుణ్‌), వ‌ర్ష‌(షాలిని పాండే) పుడ‌తారు. వీరిద్ద‌రూ త‌ర్వాత జ‌రిగే కొన్ని ప‌రిణామాల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. హైద‌రాబాద్‌లో 18 ఏళ్ల త‌ర్వాత అనుకోకుండానే క‌లుసుకుంటారు. మ‌హి ముందు వ‌ర్ష‌ను గుర్తు ప‌డ‌తాడు. త‌ర్వాత వ‌ర్ష‌కు చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తుకు చేస్తాడు. అలా ఇద్ద‌రూ వారి జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటారు. హైద‌రాబాద్‌లో పెద్ ఫొటోగ్రాఫ‌ర్‌గా పేరు తెచ్చుకున్న మ‌హి, సినిమాలో హీరోయిన్ కావాల‌నుకుని ప్ర‌య‌త్నాలు చేస్తున్న వ‌ర్ష‌కు హెల్ప్ చేస్తాడు. వ‌ర్ష హీరోయిన్‌గా ఎంపిక‌వుతుంది. క్ర‌మంగా మ‌హి, వ‌ర్ష ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. కానీ ఎవ‌రూ త‌మ ప్రేమ‌ను చెప్పుకోరు. ఈలోపు మ‌హికి పెద్ద స‌మ‌స్యే ఎదుర‌వుతుంది. ప్రాణాల‌కు ప్రమాదం అని తెలిసినా వ‌ర్ష కోసం ఊటీ వెళ‌తాడు. అక్క‌డ మ‌హి, వ‌ర్ష మ‌రింత ద‌గ్గ‌ర‌వుతారు. అప్పుడేం జ‌రుగుతుంది?  మ‌హికి వ‌చ్చిన ప్ర‌మాద‌మేంటి? ప‌్రేమికులిద్ద‌రూ క‌లుసుకున్నారా?  లేదా?  అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

సినిమా ప్రారంభం నుంచీ ఎక్కడా ఒక్కచోట కూడా 'హై' అనిపించదు. సినిమా మొదలైనప్పటి నుంచీ రాజ్‌తరుణ్‌ అలా మౌనంగా.. బలవంతంగా నవ్వుతున్నట్టు.. లోపల్లోపల ఏదో ఆలోచించుకుంటున్నట్టు కనిపిస్తాడు. దాన్ని సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అని అనుకోవాలో.. ఇంకోటనుకోవాలో అర్థం కాదు. పైగా సినిమా చూసే ప్రేక్షకుడికి నీరసం కూడా ఆవహిస్తుంది. సన్నివేశాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. అప్పుడెప్పుడో వి.ఎన్‌.ఆదిత్య సినిమాల్లో చూసిన సీన్లు ఇప్పుడు మళ్లీ చూస్తున్నట్టు ఉంటుంది. చైల్డ్ ఎపిసోడ్‌నీ, మెచ్యూర్డ్ ఎపిసోడ్‌ని కలిపి చేసిన స్క్రీన్‌ ప్లే కూడా ఎక్కడా ఆకట్టుకోదు. కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు కానీ, భావోద్వేగాలు పండించే సీన్లు కానీ అస్సలు లేవు. ప్రీ క్లైమాక్స్ లో ముద్దు సన్నివేశాలను కూడా బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. నటిగా నిలదొక్కుకోవాలనుకునే అమ్మాయిగా షాలిని పాండే నటించారు. ఆమె పాత్ర కూడా ఎక్కడా కనెక్ట్ అయ్యేలా లేదు. నాజర్‌ కేరక్టర్‌ నాటకీయంగా అనిపించింది. మంచి కథ, ఆకట్టుకునే సన్నివేశాలు, బలమైన ఎమోషన్స్, అక్కడక్కడా హాయిగా కొన్ని నవ్వులు, మళ్లీ మళ్లీ పాడుకునే పాటలు లేకపోవడం సినిమాకు మైనస్సే.

సాంకేతికంగా చూస్తే మిక్కి జె.మేయ‌ర్ పాట‌లు బాగానే ఉన్నా ఇంత‌కు ముందు ప్రస్తావించిన‌ట్లు గుర్తు పెట్టుకునేలా లేవు. అయితే మిక్కి మంచి నేప‌థ్య సంగీతాన్ని అందించారు. ఇక స‌మీర్ రెడ్డి అద్భుత‌మై విజువ‌ల్స్‌ను అందించారు. తెరమీద చలాకీగా కనిపించి, తనదైన యాసతో ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేసే  రాజ్‌తరుణ్‌ని ప్రేక్షకులు ఇలాంటి పాత్రల్లో యీక్సెప్ట్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతుందేమో.

చివ‌ర‌గా:  ఇద్ద‌రి లోకం ఒక‌టే... నెమ్మ‌దిగా సాగే ప్రేమ‌క‌థ‌

Read Iddari Lokam Okate Review in English

Rating : 2.3 / 5.0