YCP:వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్.. అక్కడి నుంచి పోటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి.ఇంతియాజ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలో చేరడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అభ్యర్థిగా ఆయనను జగన్ ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఆయన స్థానంలో ఇంతియాజ్ పోటీ చేయనున్నారు. పార్టీలో చేరిన సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ ఆశయాల మేరకు కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలున్నా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు మేలు చేశాయని.. ఈసారి కూడా కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతియాజ్‌తో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని కొండారెడ్డి బురుజుపై వైసీపీ జెండా ఎగరేస్తామని పేర్కొన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కంటే పార్టీ ముఖ్యం అని.. పార్టీ బాగుంటే తమంతా బాగుంటామని చెప్పుకొచ్చారు. కాగా ఐఏఎస్ అధికారి అయిన ఇంతియాజ్ సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout