రాయలసీమ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదే..
- IndiaGlitz, [Monday,March 04 2019]
రాయలసీమ చదువుల నేల. అన్నమయ్య, వెంగమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి, పీర్ బాబా వంటివారు తిరగాడిన నేల. ఇలాంటి నేలకు ముఠా, వర్గ పోరుతో కొన్నికుటుంబాలు చెడ్డపేరు తెచ్చాయి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మళ్లీ ఈ నేలకు పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటామని చెప్పారు.
అభివృద్ధి చేయాలంటే వర్గ పోరాటాల నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. చిత్తూరులోని బాన్స్ హాటల్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ పర్యటన విజయవంతమైంది. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో తమ దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉన్నా పరిశ్రమలు రాకపోవడానికి, అభివృద్ధి జరగకపోవడానికి కారణం కొన్ని కుటుంబాలే. రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినా.. అభివృద్ధి కొన్ని కుటుంబాలకే పరిమితం కావవడంతో మెజార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.
ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు... వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న పార్టీలు వారి అభివృద్ధికి మాత్రం పాటుపడటం లేదు. కులాలను కలిపే ఆలోచన విధానమే జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. అన్ని కులాలు, మతాలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాం. అద్భుతాలు చేస్తామని చెప్పము కానీ.. సమస్యలకు పరిష్కర మార్గాలను వెతుకుతానుఅని పవన్ అన్నారు.