మాటిచ్చా.. నిలబెట్టుకుంటా.. జనవరి-26న రూ. 15వేలు ఇస్తాం!
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ‘రాజన్న బడి బాట’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకేసారి 2 వేల మంది విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కాగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం మూడ్రోజులుగా జరగుతోంది. ఇదిలా ఉంటే.. జగన్ తన ఒడిలో చిన్నారులను కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించారు. అనంతరం వారిని ఆశీర్వదించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ శుభవార్త అందించారు.
మాటిచ్చా.. నిలబెట్టుకుంటా!
"ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలు బడికి వెళ్లాలని పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇందుకోసం ఏ తల్లిదండ్రులు కూడా అప్పులపాలు కాకూడదన్నదే నా ఆశ. నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో కష్టాలను చూశాను. పేదవాళ్లు పడుతున్న బాధలు విన్నాను. చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాను. చదువుకు అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి చూశాను. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పును తీసుకొస్తానని ఆ రోజు మాటిచ్చాను. మీ పిల్లల చదువులు ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చాను. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకొనే రోజు వచ్చింది. ఇందుకు సంతోషంగా ఉంది" అని జగన్ చెప్పుకొచ్చారు.
జనవరి-26న రూ. 15వేలు ఇస్తాం!
"ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి ఒకే ఒక్క మాట చెబుతున్నాను. మీపిల్లలను బడులకు పంపించండి. ఏ బడికి పంపించిన ఫర్వాలేదు. కేవలం పిల్లలను బడికి పంపించడమే. బడికి పంపిస్తే చాలు ఈ రిపబ్లిక్ డే నాటికి జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ రోజు పిల్లలను ఎవరైతే బడులకు పంపిస్తారో ప్రతి తల్లి చేతిలోనూ రూ.15 వేల డబ్బులు పెడతాం. ఈ రోజు ఏ తల్లి కూడా తమ పిల్లలను చదివించేందుకు అవస్థలు పడకూడదు. ఈ రోజు ఏపీలో అక్షరాల 33 శాతం మందికి చదువు రావడం లేదు. చదువుకోలేని పరిస్థితి. భారత దేశంలో యావరేజ్ చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 26 శాతం ఉంది. మన రాష్ట్రంలో 33 శాతం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రోజు మన పిల్లలు ఉన్నారని గ్రహించాలి" అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
రెండేళ్లలో ఎలా ఉంటాయో చూపిస్తాం!
"రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. స్కూల్ ఎలా ఉన్నాయో చూడండి. రెండేళ్లలో అదే స్కూళ్లు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను. ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతాం. దేశంతో పోటీ పడుదాం. ప్రతి స్కూల్‌లోనూ తెలుగు సబ్జెట్‌ను తప్పని సరి చేస్తాం. ఈ రోజు చదువుల విప్లవాన్ని తీసుకువస్తాం. మంచి స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. ఏ తల్లి కూడా అవస్థలు పడకుండా చేస్తాం. ప్రతి తల్లికి అన్నగా తోడుంటాను. మీ పిల్లలను బడికి పంపించండి. నేనున్నాను.. ఆ పిల్లలకు మామగా ఉంటాను. ఈ స్కూళ్ల పరిస్థితి మారాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి స్కూళ్ల బాట పట్టమని అందరికి ఆల్ ది బెస్ట్" అని చెబుతూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ..!
పెనుమాకలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. "ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందిస్తాం. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమం మూడో రోజు ప్రారంభిస్తున్నాం. అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యాశాఖలో అక్షరసత్యంగా ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా రూపొందిస్తాం. అన్ని వసతులు కల్పిస్తాం. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందిస్తాం. రాజన్న రాజ్యంలో పిల్లలు చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆ ఆలోచనతోనే రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం" అని మంత్రి చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com