PawanKalyan: భీమవరాన్ని వదలను.. కచ్చితంగా గెలిచి తీరాలి: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండని..175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నాయని భావించాలని పిలుపునిచ్చారు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారని.. కానీ గతంలో తాను గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేదని. గతంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు తాను పరిహరం కడుతున్నానని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ "గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదు. ఇవాళ నవశకం ప్రారంభించాం. భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారు. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి.
గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి. ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..? జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను.. కానీ ఎదుటి వాళ్లు యుద్దం కోరుకుంటే నేను దానికి రెడీ..
సిద్ధం అంటూ జగన్ కోకిలలా కూస్తున్నాడు. జగన్‌తో యుద్ధానికి సిద్దం. రాష్ట్రంలోని జలగలను తీసేస్తాం.. భీమవరంలో ఉన్న జలగను కూడా తీసేస్తాం. రాజకీయాల్లో యుద్ధం ఉండాలి కానీ బంధువత్వం ఉండకూడదు. వచ్చే ఎన్నికల్లో భీమవరాన్ని కొట్టి తీరాలి. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఏపీనే కాపాడుకునేవాడిని.. భీమవరాన్ని కాపాడుకోలేనా..? భీమవరాన్ని నేను వదలను" పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇక మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం అభ్యర్థిని తాను కాదని.. పవన్ కల్యాణే పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం తపన పడే ఏకైక నాయకుడు పవన్ అని.. ఆయన ఆశయాలకు ఆకర్షితుడై జనసేనలో చేరినట్టు చెప్పారు. మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాలంటూ సమాజం కోసం త్యాగాలు చేసిన నేత పవన్ అని ప్రశంసించారు. పవన్ వల్లే టీడీపీతో బీజేపీ జతకట్టిందని.. మూడు పార్టీల మధ్య పొత్తుకు ప్రధాన కారణం ఆయనేనని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments