నేను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను: ర‌జినీకాంత్‌

త‌మిళ‌నాడుకి చెందిన సంఘ సంస్క‌ర్త రామ‌స్వామి పెరియార్‌పై త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడంటూ.. ర‌జినీ ఇంటి ముందు పెరియార్ ద్ర‌విడ క‌ళ‌గ‌మ్ నిర‌స‌న‌లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై మీడియాతో ర‌జినీకాంత్ మాట్లాడుతూ తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌న‌ని అన్నారు. ''1971లో ఏం జ‌రిగిందనే విష‌యాన్ని నేను చెప్పాన‌ని కొంద‌రు నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అంటున్నారు. అప్పుడు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను గురించి ఓ మ్యాగ‌జైన్‌లో ప్ర‌చురిస్తే వాటిని ఆధారంగా చేసుకునే నేను మాట్లాడాను. నేనేదీ సొంతంగా ఊహించి మాట్లాడ‌లేదు. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నా ద‌గ్గ‌ర ఉన్నాయి. దీనికి నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పను'' అన్నారు.

1971లో పెరియార్ నిర్వ‌హించిన ఓ ర్యాలీలో సీతారాముల విగ్ర‌హాల‌ను అభ్యంత‌రక‌రంగా ఊరేగించార‌ని ర‌జినీ తప్పుడు ఆరోప‌ణ‌లు చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై పెరియార్ ద్ర‌విడ క‌ళైగ‌మ్ అధ్య‌క్షుడు మ‌ణి ర‌జినీకాంత్‌పై పోలీస్ స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌జ‌ల‌కు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా అన్నారు. అయితే ర‌జినీకాంత్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పులేదంటూ త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా మాట్లాడింది.