కరవు సీమ కాదు.. కల్పతరువు సీమగా చేస్తా!
- IndiaGlitz, [Friday,March 29 2019]
రాయలసీమ కరవు సీమగా కాదు, కల్పతరువు సీమగా మారుస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీమ ప్రజలకు హామీ ఇచ్చారు. రాయల సీమను కరవు ప్రాంతంగా ప్రకటించి పరిశ్రమలు స్థాపించే పారిశ్రామిక వేత్తలకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తామన్నారు. సీమ సంస్కృతి, సాహిత్యం, కళలు, కళాకారులు, కవులను గౌరవించే విధంగా రాయలసీమ కల్చరల్ అకాడమి స్థాపిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.
రెండు పంటలకు నీరిస్తాం..
ఎన్నికల శంఖారావంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టబడిన ప్రాంతం. సీమ సమగ్రాభివృద్ధికి రూ. 50 వేల కోట్లు పెట్టుబడితో సౌభాగ్య రాయలసీమ పథకానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. నందికొట్కూరు నియోజకవర్గంలో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కె.సి. కెనాల్ ద్వారా రెండు పంటలకు నీరందిస్తాం. సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకాల కింద ఉన్న చెరువులను నింపి సాగునీటి అవసరాలను తీరుస్తాం. ముచ్చుమర్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కొద్ది రోజుల్లోకే నీళ్లు రావడం మానేశాయి. ముచ్చుమర్రి ప్రాజెక్టు నీరు ఆయకట్టులో ఉన్న ప్రతి ఎకరాకి అందేలా చర్యలు తీసుకుంటాం. రైతు రుణమాఫి 5 విడతల్లో ఇస్తామని చెప్పిన చంద్రబాబు 2 విడతలు మాత్రమే ఇచ్చారు అని బాబుపై విమర్శలు గుప్పించారు.
మా ప్రభుత్వం రాగానే..
జనసేన ప్రభుత్వం రాగానే మిగిలిన రైతు రుణాలు మాఫీ చేస్తాం. పాడి, మాంస పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందిస్తాం. రైతాంగానికి చేదోడువాదోడుగా ఉంటాం. ఇంటర్ విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్లు అందజేస్తాం. ఎస్పీ, ఎస్టీ కులాల నుంచి యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద రూ. 2వేల కోట్లు కేటాయిస్తాం. రాష్ట్రంలో ప్రతి మండలంలో డిగ్రీ, పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం. రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన, భయం లేని వాతారణం ఏర్పాటు కు జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరు కూడా సీమ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాయలసీమకు అండగా నిలబడుతాం. తిరిగి రాయలవారి పాలన తీసుకొస్తాం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.