జూనియర్ ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ పలు హిట్ సినిమాలకు కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబ, అదుర్స్, బాద్షా, జైలవకుశ సినిమాలకు కూడా పనిచేశారు. ముఖ్యంగా అదుర్స్ సినిమా అయితే సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో చారీగా తారక్ వేషధారణ, డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా కోన వెంకట్ నిర్మాణంలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమాను తీశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ లాంచ్ అనంతరం కోన మీడియాతో ముచ్చటించారు. ఈక్రమంలోనే అదుర్స్2 గురించి ప్రస్తావన రాగా కచ్చితంగా ఆ సినిమా తీస్తానని తెలిపారు. " అదుర్స్ సినిమాలో చారీగా ఎన్టీఆర్ చేసిన నటన ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి అయినా సీక్వెల్‌కి ఒప్పిస్తాను" అంటూ పేర్కొన్నారు.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్వరగా ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోను మరోసారి చారీ పాత్రలో చూడాలని ఉందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తారక్.. అదుర్స్2లో నటిస్తారో లేదో వేచి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం దేవరతో పాటు వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం రెండు, మూడు సంవత్సరాలైనా పట్టే అవకాశాలున్నాయి.
కాగా 2009లో ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే ఓ మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఎప్పుడూ చేయని పాత్రలో తారక్ అద్భుతంగా నటించారు. తనలో కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఎన్టీఆర్ నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. గురుశిష్యులుగా వీరిద్దరి నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments