అసెంబ్లీలో అడుగుపెడతా.. యువతకు పోలీస్ ఉద్యోగాలిస్తా!
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
రాజకీయాలకు కావాల్సింది వేలకోట్లు డబ్బు కాదని.. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే భావజాలం, మార్పు తీసుకురావాలన్న తపన, ప్రత్యర్ధులను ఎదుర్కొనే గుండె ధైర్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కాలం మార్పు కోరుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని, వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని, వాళ్ల అవినీతిని ఎండగడతానని హెచ్చరించారు. జనసేన పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా గూట్లపాడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు.
జాబ్స్.. నిరుద్యోగ భృతి ఇస్తా..
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను గుండెల్లో పెట్టి చూసుకుంటాం. 58 ఏళ్లు దాటిన మత్స్యకారులకు రూ. 5 వేలు పింఛన్ అందించడంతో పాటు వారికి సంవత్సరానికి 300 పనిదినాలు కల్పిస్తాం. తుపాన్లు, వేట నిషేధ సమయంలో రోజుకు రూ. 500 జీవన భృతి అందిస్తాం. మత్స్యకారులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం. మత్స్యకార యువతకు 18వేల స్పెషల్ మెరైన్ పోలీస్ కమాండోలుగా ఉద్యోగాలు కల్పిస్తాం. మత్స్యకార గ్రామాలకు 6 నెలల్లో రక్షిత మంచినీటిని అందిస్తాం. పేరుపాలెం బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. బియ్యంతిప్పలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తాం. స్పీడు బోట్లు, వలలు ఉచితంగా అందిస్తాం. ప్రైవేటు యార్డ్స్ ను ప్రోత్సహిస్తాం. నరసాపురంలో గోదావరి నదిపై వశిష్ట వారధిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019 మార్పుకు నాంది పలికే ఎన్నికలు అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.