అప్పుడు 16-17 గంటలు రోడ్లపైనే గడిపాను: సోనూసూద్
- IndiaGlitz, [Tuesday,July 28 2020]
లాక్డౌన్ అనగానే ఎవరికి వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ కూడా బయటకు రాలేదు. ఆ సమయంలో వలస కార్మికుల తిప్పలు వర్ణనాతీతం. ఆ సమయంలో వారిని తమ స్వస్థలాలకు చేర్చే బాధ్యతను సోనూసూద్ తీసుకున్నారు. నాటి నుంచి ఆయన చేతికి ఎముక లేనట్టుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అది సేవ అని తాను అనని.. అది తన కర్తవ్యమని సోనూ తెలిపారు. నేడు ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో తాను ట్రాక్టర్ను అందించిన నాగేశ్వరరావు కుటుంబం కూడా పాల్గొంది. తాను అందించిన ట్రాక్టర్ను గ్రామస్తుల స్వప్రయోజనాలకు వాడాలని నాగేశ్వరరావుకు సోనూ సూచించారు.
‘‘నా తల్లిదండ్రులు నాకు చెప్పేవారు.. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడమే నిజమైన సక్సెస్ అని.. నేను సినిమాల్లో నటించిన రోల్స్ అన్నీ ఒక రైటర్ రాసినవి.. కానీ నిజ జీవితంలో నేను చేస్తున్న దానికి దేవుడే స్క్రిప్ట్ రైటర్. నా లాక్డౌన్ అంతా రోడ్లపైనే గడిచింది. 16-17 గంటలు రోడ్లపైనే గడిపాను. ఫుడ్ ఏర్పాటు చేయడం.. వలస కార్మికులకు వాహనాలు ఏర్పాటు చేయడం వింటి వాటితోనే గడిచిపోయింది. నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరినీ వారి వారి రాష్ట్రాలకు పంపించాను. అయితే దీన్ని నేను సేవ అనలేను. ఇది నా కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. తాను ట్రాక్టర్ అందించిన నాగేశ్వరరావుతో సోనూసూద్ మాట్లాడారు. తాను అందించిన ట్రాక్టర్ ద్వారా గ్రామంలో అవసరమైన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ సాయం అందించాలని సోనూసూద్ కోరారు.