నన్ను నేను అద్దంలో చూసుకుని కుప్పకూలిపోయా: అవికా

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ అనంతరం ‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హరోయిన్‌గా పరిచయమైంది. ఆమె ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. గతేడాది జరిగిన ఒక సంఘటనను కళ్లకు కట్టినట్టుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అవికా వివరించింది.

‘‘నాకు బాగా గుర్తుంది. గతేడాది ఒకరోజు రాత్రి.. అద్దంలో నన్ను నేను చూసుకుని కుప్పకూలిపోయా. నేను చూసిన దాన్ని ఏమాత్రం సహించలేకపోయాను. పెద్ద చేతులు, కాళ్లు.. బాగా పెరిగిపోయిన పొట్ట. నేను చాలా లావైపోయాను. అదేదో రోగానికి(థైరాయిడ్, పీసీఓడీ.. ఎక్స్‌ట్రా) సంకేతమేమో అనుకున్నా. ఏదైతేనేమి నా కంట్రోల్ దాటి పోయింది. కానీ అదంతా నేను విపరీతంగా తినడం, వర్కవుట్ చేయకపోవడం వల్లే జరిగింది. మన శరీరాన్ని మంచిగా చూసుకోవాలి.. అయితే నేను అదేమీ చేయలేదు. దాని ఫలితమే నేను ఏమాత్రం ఇష్టపడని విధంగా తయారయ్యాను. దీంతో నేను అమితంగా ఇష్టపడే డ్యాన్స్‌ను కూడా సరిగా చేయలేకపోయాను.

నా గురించి నేను జడ్జ్ చేసుకుంటూ.. బ్యాడ్‌గా ఫీలవుతూ చాలా బిజీ అయిపోయాను. కానీ ఇతరులు నా గురించి బ్యాడ్‌గా ఫీలయ్యేలా నేను ఎలాంటి స్కోప్ ఇవ్వదలుచుకోలేదు. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీలన్నీ నా తలలో ఎప్పుడూ ఉంటూ ఉండేవి. దీంతో నేను చాలా అలసటగా.. విసుగ్గా ఫీలయ్యేదాన్ని. నేను బాగా ప్రేమించే వారితో ఒక స్నాప్ కూడా తీసుకోలేకపోయేదాన్ని. నేను మారాలని డిసైడ్ అయిపోయా. ఏదీ ఒక్కరోజులో మారదు. మంచి విషయాలపై ఫోకస్ చేయడం స్టార్ట్ చేశా. నాకు ఇష్టమైన పనులు(డ్యాన్సింగ్ వంటివి) చేయడం.. మంచిగా తినడం, వర్కవుట్ వంటివి చేశాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను దేన్ని ఆపలేదు. మా కుటుంబ సభ్యులు కూడా నన్ను గైడ్ చేశారు.

కొద్ది రోజుల తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకున్నా. దాని నుంచి దూరంగా పోవాల్సిన అవసరం లేదనిపించింది. నా పెదవులపై చిరునవ్వు వెలిసింది. నాకు నేనే అందంగా కనిపించా. దీన్ని చదువుతున్న వారు కూడా అందమైన వారే. మనకు చాలా అవకాశాలున్నాయి. మనం వాటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. దానికంటే ముఖ్యంగా మనం ఏమీ చేయలేమని బాధపడకూడదు. మన కంట్రోల్‌లో ఉన్నదాన్ని మనం చేయగలం. ఈరోజు నేను చాలా కంఫర్టబుల్‌గా.. ప్రశాంతంగా ఉన్నాను’’ అంటూ అవికా వెల్లడించింది.