అలా ఐదు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నా: హోం మంత్రి అలీ

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

కరోనా నుంచి ఐదు రోజుల్లోనే కోలుకుని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాను ఏ విధంగా కోలుకున్నది.. తీసుకున్న జాగ్రత్తలు తదితర విషయాలను ఆయన వెల్లడించారు. వైద్యులు ఇచ్చే యాంటీబయాటిక్ మందులు తీసుకున్నానని దాంతో పాటు తులసి ఆకులతో కూడిన వేడి నీళ్లకు రోజుకు నాలుగైదు సార్లు తాగానని వెల్లడించారు.

రోజుకు రెండు సార్లు ఆవిరిపట్టానని.. ఇక ఆహారం విషయానికి వస్తే.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట ఉడకబెట్టిన గుడ్డు.. నల్ల మిరియాలతో తీసుకున్నానని.. పసుపు వేసిన పాలను తాగానని వెల్లడించారు. వేడి నీళ్లతో పాటు వేడి వేడి ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిచ్చానన్నారు. అలాగే అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుని.. గొంతులో ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి ఉప్పు వేసిన నీటిని పుక్కిలించానన్నారు. ప్రతి రోజూ ఉదయం యోగాతో పాటు ఊపిరితిత్తులకు మేలు చేసే వ్యాయామాలు చేశానని మహమూద్ అలీ వెల్లడించారు. ఇవన్నీ పాటించడం వల్లే తాను ఐదు రోజుల్లో సాధారణ స్థితికి వచ్చానని.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానని వెల్లడించారు.