Rashmika Mandanna : నన్ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు.. అసలేం జరిగిందంటే : రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూ నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్నపై ఇప్పుడు ఆమె సొంత ఇండస్ట్రీ గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమ, అభిమానులు మండిపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ రష్మిక చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో కన్నడ పరిశ్రమ గుస్సా అవుతోంది. ఇదొక కారణమైతే.. ఇటీవల రిలీజై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాను తాను చూడలేదంటూ రష్మిక ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా శాండిల్ వుడ్‌లో కాకరేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్మికపై కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించిందంటూ వార్తలు వచ్చాయి.
ప్రతీది బయటకు చెప్పలేను :
ఈ వివాదంపై తాజాగా రష్మిక స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని, కాంతారా సినిమాను తాను చూడలేదంటూ కొందరు ఓవరాక్షన్ చేశారని.. కానీ ఆ చిత్రం చూసి ఆ మూవీ యూనిట్‌ని అభినందిస్తూ మెసేజ్ పెట్టానని రష్మిక పేర్కొన్నారు. వారు కూడా థ్యాంక్స్ చెప్పారని ఆమె అన్నారు. తన వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టి ప్రపంచానికి చూపించలేనని, అవి వారికి అనవసరమని రష్మిక స్పష్టం చేశారు. వృత్తిగతంగా తాను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని ఆమె అన్నారు. తనపై కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని రష్మిక వ్యాఖ్యానించారు.
కిర్రాక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక :
2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘‘కిర్రాక్ పార్టీ’’తో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌గా నిలవడమే కాకుండా, ఆమెకు తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీ యాక్టర్‌గా మారడంతో రష్మిక కన్నడంలో ఎక్కువ సినిమాలు చేయడం లేదు.
అది ‘‘సోకాల్డ్’’ ప్రొడక్షన్ హౌస్:
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనకు కిరాక్ పార్టీలో అవకాశం ఎలా దక్కిందన్న దాని గురించి చెబుతూ, తనకు ఆ ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును చెప్పలేదు. దానికి ‘‘సోకాల్డ్’’ అంటూ వ్యాఖ్యానించింది . నిజానికి రష్మికకు ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టికి చెందిన పరమ్‌వహా స్టూడియో అవకాశం ఇచ్చింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో రక్షిత్‌తో రష్మిక ప్రేమలో పడి అది ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లింది. కానీ మనస్పర్థల కారణంగా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కకముందే ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. అది రక్షిత్ శెట్టికి సంబంధించిన బ్యానర్ కావడం వల్లే ఆ ప్రొడక్షన్ హౌస్ పేరును ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావించలేదని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments