అది తెలియ‌క‌పోయినా డ‌బ్బింగ్ చెప్పాను - జ‌గ‌ప‌తి

  • IndiaGlitz, [Saturday,July 09 2016]

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్). డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రాన్ని ఈనెల‌లో దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు విడుదల చేయ‌నున్నారు. ఒక ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు. అయితే...ఈ చిత్రంలో ని ప్రధాన పాత్రకు జ‌గ‌ప‌తి బాబు డబ్బింగ్ చెప్పటం విశేషం. జ‌గ‌ప‌తిబాబు త‌న చిత్రం కాకుండా వేరే చిత్రంలోని ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ....స్పీల్ బ‌ర్గ్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ క‌లిసి రూపొందిన ఈ చిత్రంలోని ఒక పాత్రకు డ‌బ్బింగ్ చెప్పాల‌ని న‌న్ను అడిగిన‌ప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ మూవీతో అసోసియేట్ అవ్వ‌డం మంచి అవ‌కాశం భావించాను. నాకు ఏక్టింగ్ అంటే ఏమిటో తెలియ‌దు...అయినా తెలియ‌కుండానే ఏక్టింగ్ చేసేస్తున్నాను. అలాగే డ‌బ్బింగ్ అంటే ఏమిటో తెలియ‌క‌పోయినా ఈ చిత్రంలో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పేసాను.

ఈ మూవీ క‌థ ఏమిటో తెలియ‌దు. అయినా వాళ్లు ఎలా చెప్ప‌మంటే అలా డ‌బ్బింగ్ చెప్పాను. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని డ‌బ్బింగ్ చెప్పాను. ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు నా వాయిస్ లో ఛేంజ్ క‌నిపించేలా డ‌బ్బింగ్ చెప్పాను. ఈ చిత్రం హిందీ వెర్షెన్ కి అమితాబ్, త‌మిళ వెర్షెన్ కి నాజ‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. అమితాబ్, నాజ‌ర్ చెప్పిన పాత్ర‌ల‌కు తెలుగు వెర్షెన్ లో నేను డ‌బ్బింగ్ చెప్ప‌డం గ్రేట్ గా ఫీల‌వుతున్నాను. నా ఫ‌స్ట్ మూవీకి నా వాయిస్ బాగోలేదు అన్నారు...ఆత‌ర్వాత నా వాయిస్ ని బాగా గుర్తించింది అంటే రామ్ గోపాల్ వ‌ర్మ‌. గాయంలో నా వాయిస్ కి మంచి పేరు వ‌చ్చింది. ఒక‌ప్పుడు నా వాయిస్ బాగోలేదు అన్నారు..ఇప్పుడు నేను వేరే పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం అనేది మ‌ర‌చిపోలేని అనుభూతి అన్నారు.

రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్ర‌తినిథి శ్రీధ‌ర్ మాట్లాడుతూ...మహాకాయుడి పాత్ర‌కు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాలి అన‌గానే మైండ్ లో జ‌గ‌ప‌తిబాబు గారే గుర్తుకువ‌చ్చారు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు జ‌గ‌ప‌తిబాబు గారు అద్భుతంగా డ‌బ్బింగ్ చెప్పారు. భారీ బడ్జెట్ , అబ్బురపరిచే గ్రాఫిక్స్ మరియు ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ బి ఎఫ్ జి చిత్రాన్ని ఈనెల‌లో రిలీజ్ చేయ‌నున్నాం. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది రెండు రోజుల్లో తెలియ‌చేస్తాం అన్నారు.