'స్పైడర్ ' చిత్రంలో మహేష్ ను తప్ప మరే హీరోను ఊహించుకోలేను - ఎ.ఆర్.మురుగదాస్
- IndiaGlitz, [Tuesday,August 22 2017]
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పైడర్'. సెప్టెంబర్ 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ సినిమా గురించి పాత్రికేయులతో ముచ్చటించారు.
స్పైడర్ సినిమా ఎలా వచ్చింది?
సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. హ్యాపీగా ఉన్నాం. స్టాలిన్ తర్వాత నేను పదేళ్లకు నేను చేస్తున్న స్ట్రయిట్ తెలుగు మూవీ. నేను విజయవాడలో 'ఒక్కడు' సినిమా చూశాను. సినిమా విడుదలై రెండు వారాలైనా పండుగలా ఉంది. క్యాజువల్‌గా మహేష్ చూపించిన సెటిల్డ్ పెర్ఫామెన్స్ నాకు బాగా నచ్చింది. తర్వాత నేను చేసిన స్టాలిన్ సినిమా సమయంలోనే పక్కనే పోకిరి సినిమా సాంగ్ షూట్ జరుగుతుంది. అప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావుగారు మహేష్‌ను పరిచయం చేశారు. తర్వాత కొన్ని రోజులకు మహేష్‌ను కలిసినప్పుడు నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నానండి..అని అన్నాను. తను కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. అయితే తర్వాత నేను గజినీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. బిజీ అయ్యాను. తెలుగు, తమిళంలో ఓ సినిమా చేయాలనుకోగానే ఈ కథను అనుకున్నాం. కథలో హీరోయిజం ఉండాలి. ఫ్యామిలీ ఆడియెన్స్, ఫ్యాన్స్, రెగ్యులర్ ఆడియెన్స్‌కు సినిమా నచ్చేలా ఉండాలి. అలాగే తమిళంలో కూడా మహేష్ చేస్తున్న స్ట్రయిట్ మూవీ కాబట్టి బేలెన్సింగ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. కాబట్టి స్క్రిప్ట్ మోడ్రన్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. తెలుగు, తమిళంలో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక సాంగ్ మినహా సినిమా పూర్తయ్యింది. పదేళ్లు వెయిట్ చేసినందుకు తగ్గ సినిమా చేసినట్లు అనిపించింది. డెఫనెట్‌గా తెలుగు, తమిళ ఆడియెన్స్‌ను అలరిస్తుందని చెప్పగలను.
మహేష్‌తో వర్క్ చేయడం గురించి?
నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో పనిచేశాను. మహేష్ వర్కింగ్ స్టైల్‌ను మరొకరితో కంపేర్ చేయలేను. అందరూ దర్శకులు మహేష్‌తో ఓ సినిమా అయినా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏడాది పాటుగా మహేష్‌తో ట్రావెల్ చేస్తున్నాను. తన లాంటి హీరోను చూడలేదు. తను దర్శకుల హీరో. స్పైడర్ సినిమాను రాత్రి పూట షూటింగ్స్‌ను 80 రోజులు పాటు చేశాం. స్క్రిప్ట్ విన్న తర్వాత తనెక్కడా ఇన్‌వాల్వ్ కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమాలో నటించారు. ఇండియాలో మరే సూపర్‌స్టార్ ఇంతలా కష్టపడటం నేను చూడలేదు. చాలా సపోర్ట్ చేశారు. మీరు ఫైనల్ అవుట్‌పుట్ చూడండి. మీకు మరో ఐదారు సీన్స్ యాడ్ చేయాలంటే చేయండి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అయిపోందని చెబితే నా నెక్స్‌ట్ మూవీకి వెళతాను అని అన్నారు. నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. స్పైడర్ సినిమాలో మహేష్‌గారిని తప్ప మరే హీరోను ఊహించుకోలేనంతగా ఇమిడిపోయారు. సినిమాను రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేశాం. ఎన్ని టేక్స్ అయినా చాలా కూల్‌గా ఉండి పూర్తి సహకారాన్ని అందించారు.
స్పైడర్ సినిమా కంటే ముందు మహేష్‌ను తరుచూ కలిసేవారా?
ఏడాదికొకసారైనా కలిసేవాడిని. కత్తి సమయంలో కూడా మహేష్‌ను కలిశాను. నేను ఆయన్ను కలిసేటప్పటికీ వేరే ప్రాజెక్ట్ మధ్యలో ఆయన బిజీగా ఉండేవారు. డేట్స్ కుదరలేదు. అందువల్ల ఈసారి డేట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని బై లింగ్వువల్ మూవీ చేయాలనుకున్నాం. ఈ సినిమా కథను తమిళ శ్రీమంతుడు ఆడియో వేడుకకు మహేష్ వచ్చినప్పుడు కలిసి చెప్పాను. ముందు 20 నిమిషాల పాటు కథను వివరించాను. నేను చేసిన సినిమాల్లో తుపాకీ, గజినీ స్టైలిష్ మూవీస్ అయితే, రమణ, కత్తి ఎమోషనల్ మూవీస్. మహేష్‌గారితో సినిమా అంటే మోడ్రన్‌గా ఉండాలని స్పైడర్ కథను సిద్ధం చేసుకున్నాను. ఒక నెల తర్వాత మహేష్‌కు పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించాను. ఆయనకు నచ్చింది.
జేమ్స్‌బాండ్ తరహా సినిమాలా స్పైడర్ ఉంటుందనుకోవచ్చా?
స్పైడర్ జేమ్స్‌బాండ్ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచెరిస్టిక్ మూవీ కాదు. స్పైమూవీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి. సాధారణంగా నా సినిమాల్లో డైరెక్ట్ మెసేజ్ లేక ఇన్‌డైరెక్ట్ మెసేజ్‌లుంటాయి. స్పైడర్‌లో కూడా హ్యుమానిటీకి సంబంధించిన మెసేజ్‌తో సినిమా ఉంటుంది. మనిషిలో హ్యుమానిటీ తగ్గిపోయినప్పుడు సోసైటీలో లంచం పెరిగిపోతుంది లేదా మరేదైనా వైపరీత్యం సంభవిస్తుంది. ఈ మెసేజ్‌ను నేను ఇన్‌డైరెక్ట్‌గా ఈ సినిమాలో చూపిస్తున్నాను.
స్పైడర్‌ను హిందీలో చేయలేందుకని?
సినిమా ప్రారంభంలోనే తెలుగు, తమిళంలోనే చేయాలనుకున్నాం. హిందీలో చేయమాలనుకోలేదు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో షూట్ చేయడం వల్ల నేను వేసిన ప్లానింగ్ కంటే షూటింగ్‌కు ఎక్కువ రోజుల సమయం పట్టింది.
తెలుగు, తమిళ క్లైమాక్స్‌ల్లో మార్పు ఉంటుందని వార్తలు వస్తున్నాయి కదా..?
అలాంటిదేం లేదండి..రెండు భాషల్లోనూ క్లైమాక్స్ ఒకేలా ఉంటుంది. చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించాం. టెక్నికల్‌గా సినిమా హై ఎండ్‌లో ఉంటుంది.
నిర్మాతల గురించి..?
నేను, మహేష్ కలిసి సినిమా చేస్తున్నామంటే కచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాగానే ఉంటుంది. కాబట్టి సినిమాను ప్రేమించే నిర్మాతలు అవసరం. ఠాగూర్, గజినీ, కత్తి సినిమాల నుండి ఠాగూర్ మధుగారితో పదేళ్ల పరిచయం ఉంది. అలాగే తిరుపతి ప్రసాద్‌గారితో కూడా చాలా కాలంగా అనుబంధం ఉంది. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మహేష్‌గారు ఠాగూర్ మధు, తిరుపతి ప్రసాద్‌గారైతే నిర్మాతలు ఎలా ఉంటుందని నన్ను అడిగారు. వారితో నాకు చాలా కాలంగా ఉన్న మంచి అనుబంధంతో నేను ఎస్ చెప్పాను. సినిమా స్టార్ట్ అయినా తర్వాత మేం అనుకున్న దానికంటే గ్రాండియర్ ఇంకా ఎక్కువైంది. బెటర్‌గా చేద్దామని, నిర్మాతలిద్దరూ నాకు సపోర్ట్ చేశారు. గ్రాఫిక్స్‌ను కూడా లండన్, రష్యా నుండి టెక్నిషియన్స్‌తో చేయిస్తున్నారు. ప్రతి విషయంలో నిర్మాతలు చాలా కేర్ తీసుకుని పిల్లర్స్‌లా సినిమాను ప్రేమించి చేశారు.
హీరోయిన్‌గా ముందు పరిణితి చోప్రాను అనుకున్నారు కదా..?
అనుకున్నమాట నిజమే. అయితే సినిమాను రెండు భాషల్లో ఏక కాలంలో తీయాలనుకున్నప్పుడు రెండు భాషలు తెలిసిన హీరోయిన్ కావాలనిపించింది. పరిణితి చోప్రా ముంబై అమ్మాయి తెలుగు, తమిళం రెండు భాషలు రావు. రెండు భాషల్లో భాష రాని అమ్మాయిని హీరోయిన్‌గా మెనేజ్ చేయడం కష్టం. అలాంటప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అయితే రెండు భాషలను అర్థం చేసుకుంటుందని చెప్పడంతో మేం రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాం.
ఎస్.జె.సూర్యను విలన్‌గా తీసుకోవడానికి కారణమేంటి?
విలన్ అంటే ఆరడుగులు, ఆరు పలకల దేహం ఉండాల్సిన అవసరం లేదు. మా కథకు తగినట్లుగా బుద్ధి బలం ఎక్కువగా ఉండే విలనిజం కనిపించాలి. హీరోకు కనిపించకుండా గెరిల్లా ఎటాక్‌లా హీరోతో ఫైట్ చేయాలి. అందుకు ఎస్.జె.సూర్య అయితే యాప్ట్ అవుతాడనిపించింది. అదీ కాక నేను సూర్య మంచి స్నేహితులం. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో ఇద్దరం కలిసి పనిచేశాం. ఎస్.జె.సూర్య డైరెక్ట్ చేసిన 'ఖుషీ' చిత్ర దర్శకత్వ శాఖలో నేను 15-20 రోజుల పాటు పనిచేశాను. భరత్ కూడా ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. తన పాత్ర గురించి ఇప్పుడు చెబితే సస్పెన్స్ పోతుంది.
స్పైడర్ మూవీలోఎలాంటి మెసేజ్ ఉంటుంది?
ప్రజలు నిద్ర లేచినప్పటి నుండి ఏదో మెసేజ్ తీసుకుంటూనే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రజలకు మెసేజ్‌లంటే విరక్తి వచ్చింది. అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు స్పైడర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా మెసేజ్ ఉంటుంది. నేను డైరెక్ట్ చేసిన రమణ(తెలుగులో ఠాగూర్) మూవీలో మెసేజ్ ఉంటుంది. చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఎక్కడా జాతీయగీతం, జాతీయ పతాకం, వందేమాతర గీతం వంటి అంశాలు కనపడవు. దేశభక్తి సినిమా అయినంత మాత్రాన సినిమాలో పైన చెప్పిన అంశాలు ఉండాలనేం లేదు. ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంటుంది. మెసేజ్ కంటే ముందు సినిమాలో మనం చెప్పే విషయాలు ఆడియెన్స్‌ను పాడు చేయకూడదు. మంచి మెసేజ్ ఇవ్వకపోయినా, తప్పుడు మెసేజ్ మాత్రం ఇవ్వకూడదు. ఉదాహరణకు మహేష్‌లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమాలో సిగరెట్ త్రాగుతూ కనపడితే ఆయన వీరాభిమాని గుడ్డిగా ఆయన్ను ఫాలో కావడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కనపడవు. సినిమాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. సినిమాలనే కాదు, మీడియా తప్పకుండా ప్రభావం చూపుతుంది. సినిమా ఇంపాక్ట్ చూపాలి. ఆ ప్రభావం బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి.
స్పైడర్ సినిమా ఎన్ని భాషల్లో విడుదలవుతుంది?
తెలుగు, తమిళం, మలయాళంతో గల్ఫ్ కంట్రీస్‌లో అరబిక్‌లో కూడా సినిమాను సెప్టెంబర్ 27నే విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు నిర్మాతలు.
తదుపరి చిత్రాలు?
తదుపరిగా నేను తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాను. చర్చలు నడుస్తున్నాయి. ఇకపై నేను బాలీవుడ్‌లో చేసినా స్ట్రయిట్ మూవీనే చేయాలనుకుంటున్నాను. సల్మాన్‌ఖాన్‌గారిని కలిసి బేసిక్ ఐడియా, క్యారెక్టర్, ఇంటర్వెల్ బ్లాగ్ అన్ని చెప్పాను. ఆయనకి కూడా నచ్చింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సార్ అంటే నెక్స్‌ట్ వీక్ అంటారు. అంత తక్కువ గ్యాప్‌లోనా అని నాకు అనిపిస్తుంటుంది. నేను నా సినిమాను పూర్తి చేసుకోగానే, ఆయన మరో సినిమాతో బిజీగా ఉంటారు. అప్పుడు నేను వెయిట్ చేయాల్సిందే. బిగ్ హీరోతో సినిమా అంటే వెయిట్ చేయాల్సిందే. అలాగే రజనీకాంత్‌గారికి కూడా కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. అయితే ఆయన 2.0, కాలా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే నా సినిమా ఉంటుంది. డేట్స్ అన్ని కుదిరితే సినిమా సెట్స్‌లోకి వెళ్లిపోతుంది.
నిర్మాతగా ఏ సినిమాలు చేస్తున్నారు?
ప్రస్తుతం నా ప్రొడక్షన్‌లో సినిమాలేవీ చేయడం లేదు. నేను స్పైడర్‌తో బిజీగా ఉన్నాను. ఈ సినిమా విడుదలైన తర్వాత కాస్తా గ్యాప్ తీసుకుని ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తాను. దర్శకత్వం కంటే ప్రొడక్షన్‌లోనే ఎక్కువ రిస్క్ ఉంటుంది. తెలుగు, తమిళంలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాను.