ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చా.. నా పూర్వ జన్మ సుకృతం!

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

మహానటుడు ఎస్వీ రంగారావు జీవిత చరిత్రపై రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సంజయ్‌ కిషోర్‌ లిఖించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిరు.. ఎస్వీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రంగారావును చూసే నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నేను గొప్పగా ఆరాధించే రంగారావు గారి పుస్తకం నేను రిలీజ్ చేయడం నా పూర్వ జన్మ సుకృతంఅని చిరు చెప్పుకొచ్చారు. తెలుగు తెరపై చెరిగిపోని నటుడు ఎస్వీరంగారావు అని మెగాస్టార్ కొనియాడారు.

ఆయనతో నాన్న నటించారు.. చెర్రీకి చెప్పా!

రంగారావు అంటే తన తండ్రికి ఎంతో అభిమానమని.. ఆయనతో కలిసి సినిమాల్లో నటించారని ఈ సందర్భంగా చిరు గుర్తు చేశారు. ఇంటికి వచ్చి రంగారావు గురించి గొప్పగా చెప్పేవారన్నారు. నాటి నుంచి రంగారావు అన్నా.. ఆయన నటన అన్నా చాలా ఇష్టంగా మారి.. తన ఒంట్లో నటన అనే బీజం పడిందని చిరు ఆసక్తికర విషయం చెప్పారు. అంతేకాదు.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పగానే మొదట రంగారావు సినిమాలు చూడమని తాను సలహా ఇచ్చానని చిరు తెలిపారు.

చిరుపై పుస్తకం..!

ఇదిలా ఉంటే.. చిరుపైన కూడా పుస్తకం రాయాలని సంజయ్‌ కిషోర్‌‌ను బ్రహ్మానందం కోరారు. అయితే ఇందుకు సంజయ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బ్రహ్మి తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, బ్రహ్మానందం, తణికెళ్ల భరణితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావుతో అనుబంధం, ఆయన గురించి తెలిసిన విషయాలు వెల్లడించారు.