నా భార్యను క్షమించమని అడిగాను: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

గత పదేళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని.. ధర్మో రక్షతి రక్షితః అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనను తిట్టారని, తన భార్యాబిడ్డలను కూడా తిట్టారని, అవమానించారని వాపోయారు. అయినా కానీ ప్రజల కోసం అన్నింటినీ భరించానని తెలిపారు. వైసీపీ సర్కార్ దోపిడీకి దారులు వెతికింది... కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త వెలుగులు చిందిస్తుందన్నారు.

వచ్చే ముందు నా భార్యకు ఒకటే మాట చెప్పాను... ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలనేది విదుర నీతి. ఈ రాష్ట్రం కోసం మన కుటుంబాన్ని నష్టపోయినా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందాం అని నా భార్యకు చెప్పాను. విదేశీయురాలైన ఆమెకు భారతీయ రాజకీయాలు అర్థంకావు. ఎందుకు తిడుతున్నారు అని అడిగింది. అందుకు ఆమెకు క్షమాపణలు చెప్పాను అని వివరించారు.

జగన్ ఇవాళ భయపడుతున్నాడు. జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన పార్టీ. జగన్ ఇవాళ రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నాడు, మాట్లాడడానికే భయపడుతున్నాడు. ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడని భయపడుతున్నాడు. జగన్ మన హక్కులను అణచివేయాలని చూశాడు, భయపెట్టాలని చూశాడు. అలాంటి వ్యక్తిని భయపెట్టింది జనసేన పార్టీ! ఒక వీరమహిళ, ఒక జనసైనికుడు, సుగాలి ప్రీతి తల్లి, భవన నిర్మాణ కార్మికులు నా వద్దకు సమస్యలు తీసుకుని వస్తే వారి తరఫున నేను ప్రశ్నించి భయపెట్టాను.

151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీని పక్కనబెట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ కండువాను మెడలో వేసుకున్నారంటే... అదీ... జనసేన పార్టీ బలం! దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఇన్నేళ్లు నిలబడింది లేదు. ఇది నా గొప్పతనం అనుకోవడంలేదు... నన్ను గుండెల్లో పెట్టుకున్న ఆడపడుచులు, జనసైనికుల పోరాట స్ఫూర్తి వల్లే పార్టీ నిలబడింది.

ఏపీ దశ దిశ మార్చేందుకు పిఠాపురం వచ్చాను. పిఠాపురం నుంచే మొదలుపెడతా. దేశం గర్వించేలా పిఠాపురం నుంచే మార్పుకు శ్రీకారం చుడతా. నేను పనిచేస్తోంది ప్రజల కోసం, యువత కోసం. ఒక తరం కోసం పోరాడుతున్నాను, రెండు తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను. మొన్న సాయి ధరమ్ తేజ్ ప్రచారం కోసం పిఠాపురం వస్తే వైసీపీ గూండాలు గాజు సీసాతో దాడి చేయడానికి ప్రయత్నించారు. తృటిలో ప్రమాదం తప్పింది. ఆ ఘటనలో టీడీపీ కార్యకర్తకు గాయమైంది. ఇలాంటి దాడులు చేసే పార్టీ వైసీపీ... కానీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ జనసేన. ఇలాంటి గాజు సీసా దాడులు మమ్మల్ని భయపెట్టలేవు.

ఈ ఎన్నికల్లో డబ్బు ఎవరిచ్చినా సరే ఓటు మాత్రం జనసేనకు మాత్రమే పడాలి... గాజు గ్లాసు గుర్తుపైనే ఓటు పడాలి. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బ్యాలెట్‌లో ఆయన నెంబరు 9... దేవీ నవరాత్రులు గుర్తుంచుకోండి. శ్రీనివాస్‌కు ఓటేయండి. ఇక పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈవీఎం బ్యాలెట్‌లో నా నెంబరు 4... అంటే చతుర్ముఖ బ్రహ్మ.... గాజు గ్లాసు గుర్తుపై ఓటు పడిపోవాలంతే అని పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.