దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నా..: మాగంటి రూప
- IndiaGlitz, [Friday,April 19 2019]
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె స్పల్పంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రూప పోటీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె ఆరోగ్యంపై నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆందోళన చెందుతుండటంతో స్వయంగా ఆమె స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో రాజమండ్రి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరి వెళ్లాను. నా వోల్వో కారుకు మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవుడి దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల నాకేమీ కాలేదు.నాకు జరిగింది చిన్న ప్రమాదమే. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఆందోళ చెందాల్సిన పనిలేదు.. అందరికీ కృతజ్ఞతలుఅని మాగంటి రూప వీడియోలో తెలిపారు.