ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తిని కాను: పవన్
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో పంట పొలాలను పరిశీలించారు. అలాగే ఉయ్యూరులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తుపాను కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. చేతికంది వచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు. మీకు అండగా ఉండాలనే మీ దగ్గరకు వచ్చానని పవన్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయబోమని పవన్ వెల్లడించారు.
ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తిని కానన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని... ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చానన్నారు. కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బ తిన్నదన్నారు. సొంత భూమి రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా రైతాంగాన్ని అదుకోవాలన్నారు. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని.. రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని పవన్ తెలిపారు.
పవన్ పర్యటనలో అపశృతి..
ఈ ర్యాలీలో పవన్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌లు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి కాలు పూర్తిగా విరిగిపోయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.