నేను ఎప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథ్‌నే
Send us your feedback to audioarticles@vaarta.com
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తరువాత నేను చాలా మందికి దూరమై విభిన్నంగా కనిపిస్తున్నానే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు మీలో ఒకడిగా వున్న నన్ను ఈ పురస్కారం దూరం చేస్తోందా అనిపించింది. అవార్డు తీసుకుని ఒకేసారి నేను హైజంప్ చేశానని రచయిత్రి యుద్దనపూడి సులోచనరాణి అన్నారు. నాకూ అలాగే అనిపిస్తున్నది అన్నారు కె.విశ్వనాథ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన ఆయనను ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రాతికేయులతో మొదటి నుంచి నాకు మంచి అనుబంధాలున్నాయి. అయితే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా వున్నాయి. మమ్ముట్టితో నేను ఓ సినిమాని ఓ ఆలయంలో చిత్రీకరిస్తున్న సందర్భంలో కొంత మంది స్థానిక పాత్రికేయులు ఆ లొకేషన్‌కు వచ్చారు. భోజన విరామ సమయంలో తీరిగ్గా మాట్లాడుకుందామని వారితో చెప్పాను. తరువాత వారడిగిన ప్రశ్నలకు అదేమిటో నా అదృష్టం. నా సినిమాలో నటించే ప్రతి నటుడు విభిన్నంగా కనిపిస్తుంటారు. దేవాలయాల్లో చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో కొంత మంది నాకు పాదాభివందనం చేస్తుంటారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించేదని చెప్పాను. ఆ తరువాత కొన్ని రోజులకు చిరంజీవి ఓ సందర్భంలో కలిసి మిమ్మల్ని ఓ విషయం అడగాలి ఏమీ అనుకోరు కదా అని అడిగాడు. ఫరవాలేదు ఏమీ అనుకోను చెప్పు అన్నాను. దర్శకుల్లో పాదాభివందనం చేయించుకుంటున్న ఏకైక దర్శకుడు మీరే అంటున్నారు అన్నాడు.
ఆ మాటలు విన్న దగ్గరి నుంచి పాత్రికేయులన్నా, వారితో మాట్లాడాలన్నా నాకు భయం. అందుకే ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతుంటాను. ఈ విషయం జనాలకు తెలియక ఇతనికి ఇంత పొగరా అనుకుంటారు. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఢిల్లీలో అవార్డు తీసుకున్న తరువాత కొత్తగా ప్రవర్తిస్తున్నానని నా మనవరాలు గాయత్రిని అడిగితే అది పొగరు అని నిర్మొహమాటంగా చెప్పేసింది. అవార్డు పొందిన తరువాత నాలో ఏ మాత్రం మార్పు రాలేదు. నేను అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మీ కాశీనాథుని విశ్వనాథ్‌నే. శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది వంటి చిత్రాల్ని నా చేతి తీయించి నాకు అవార్డు రావడానికి కారకులైన నిర్మాతలందరికి కృతజ్ఞడినై వుంటాను.
ఆ రోజుల్లో నాతో సినిమా నిర్మించాలని ఎవరు వచ్చినా వద్దని చెప్పేవాడిని. ఎవడో సినిమా తీయడానికి వస్తే వద్దని చెబుతావు నీకేం మాయరోగం, రాగానే అపశకునపు మాటలు మాట్లాడతావు ఎందుకు అని నిర్మాత డి.వి.సరసరాజు నాతో వాదించే వారు. నాతో సినిమా తీయాలనుకునే నిర్మాతకు ఎందుకు నేను అలా చెప్పేవాడిని అంటే నేను తీసిన సిరిసిరిమువ్వ, సిరివెన్నెల చిత్రాలకు అనుకున్నదానికన్నా బడ్జెట్ ఎక్కువైంది. అందుకే నాతో సినిమా అంటే డబ్బులు రావని నిర్మాతలకు ముందు చెప్పేవాడిని. నాతో అత్యధిక చిత్రాలు నిర్మించిన ఏడిదనాగేశ్వరరావు ఏనాడూ నన్ను పేరు పెట్టి పిలవలేదు. ఎప్పుడూ డైరెక్టర్‌గారనే పిలిచేవారు. ఆయన సినిమాను ప్రేమించాడు కాబట్టే అత్యుత్తమమైన చిత్రాల్ని నిర్మించారు. నాతో పనిచేసిన ప్రతి ఒక్కరూ నన్ను దర్శకుడిగా కంటే ఒక అధ్యాపకుడిగానే చూశారు. నేను అప్పటికి ఇప్పటికి మీ కాశీనాథుని విశ్వనాథ్‌నే. నన్ను ఎప్పటికీ అలానే చూడండి..అలాగే పిలవండి.
ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి.ఏ.రాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మడూరి మధు, సాయిరమేష్, పర్వతనేని రాంబాబు, సురేష్ కొండేటి, ప్రభు, రాంబాబువర్మ, -రెడ్డి హనుమంతరావు, దివాకర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments