‘శాట్’లో హైదరాబాదీ యువతి అత్యుత్తమ ప్రతిభ..

  • IndiaGlitz, [Sunday,December 20 2020]

ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల మంది రాసిన ఆ పరీక్షలో మూడు వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఆ మూడు వేల మందిలో హైదరాబాదీ యువతి కూడా ఉండటం విశేషం. అసలు విషయంలోకి వెళితే.. అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష శాట్(స్కోలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరికి చెందిన విద్యార్థిని లక్కినేని శర్మిష్ట అత్యత్తమ ప్రతిభను కనబరిచింది.  1600 లకు గాను.. 1570 మార్కులు సాధించి సీటు సంపాదించడం విశేషం. ఆమెకు అర్థ శాస్త్రంపై మక్కువ బాగా ఎక్కువ. దీంతో ఆమె మసాసుచెట్స్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం చదవాలన్న ఆసక్తితోనే శాట్‌కు సన్నద్ధమైంది.

21 లక్షల మంది ఈ పరీక్షను రాయగా.. మూడు వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వారిలో శర్మిష్ట ఒకరు. ప్రిన్స్ హాటన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో దేనిలో సీటొచ్చినా తాను డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేస్తానని వెల్లడించింది. ఇండియాకు తిరిగొచ్చిన అనంతరం తన తండ్రికి సాయంగా నిలుస్తానని శర్మిష్ట వెల్లడించింది. తన తండ్రి లక్కినేని శ్రీనివాస్ ఆశయ సాధనలో భాగంగా ఆర్థిక సంస్కరణలతో పాటు పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతానని శర్మిష్ట వెల్లడించింది. కాగా.. శర్మిష్ట పదో తరగతి వరకూ బేగంపేటలోని గీతాంజలి పబ్లిక్ స్కూలులోనూ.. ఇంటర్ కూకట్‌పల్లిలోని జైన్ హెరిటేజ్ స్కూలులోనూ విద్యనభ్యసించింది.