కంటతడి పెట్టిస్తున్న హైదరాబాదీ ఫేస్‌బుక్ పోస్ట్...
Send us your feedback to audioarticles@vaarta.com
మానవత్వం మంటగలుస్తోంది.. రోజురోజుకు మానవీయ సంబంధాలు కనుమరుగవుతున్నాయ్.. ఇదేదో సినిమా పాట కాదండోయ్. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటన ఇది. ఈ ఒక్క సంఘటన గురించి చదివారనుకో అసలు నిజంగా ఇది జరిగిందా..? అని ముక్కున వేలేసేకుంటారు. ఈ ఘటన ఎక్కడో కాదు జరిగింది మన హైదరాబాద్‌లోనే అంటే నమ్మలేరేమో.!
వివరాల్లోకెళితే.. తండ్రి రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇద్దరు కుమార్తెలు చేయని ప్రయత్నాలు లేవ్. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే మొదట గుర్తొచ్చేది 108.. అంబులెన్స్‌కు కాల్ చేశారు. అసలే అర్ధరాత్రి కావడంతో అంబులెన్స్ సిబ్బంది రాలేమని చేతులెత్తేశారు. అనంతరం క్యాబ్ డ్రైవర్‌కు కాల్ చేశారు. ఎంత బతిమిలాడినా.. సార్ మా నాన్న కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని ప్రాధేయపడినా ఎవరేగానీ కనికరం చూపలేదు. ఆరు రోజుల క్రితం ఈ ఘటన గురించి ఆ ఇద్దరు కుమార్తెలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వెలుగు చూసింది.
క్యాబ్ వచ్చినప్పటికీ...
గత కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్న వేణుగోపాల్ గౌడ్.. తీవ్ర రక్తస్రావమై మంచం మీదే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తండ్రి రక్తపుమడుగులో పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక కుమార్తెలిద్దరూ నిర్ఘాంతపోయారు. వెంటనే ఫోన్ నెట్ ఆన్ చేసి క్యాబ్ బుక్ చేశారు. సరిగ్గా పది నిమిషాలకే క్యాబ్ వచ్చింది కానీ పేషెంట్ అని చెప్పడంతో కారు పాడవుతుందని ట్రిప్ రద్దు చేసుకున్నాడు. దీంతో ఆ ఇద్దరూ డ్రైవర్‌ను పదే పదే బతిమలాడారు.. అయినా జాలి లేని ఆ డ్రైవర్ కనీసం కనికరించలేదు. అంతేకాదు ఆఖరికి డబ్బులు ఎక్కువిస్తామన్నా కుదరదన్నాడు. చివరికి 108 కూడా రాకపోవడంతో రోడ్డుపైకి వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్యాబ్ రావడం.. అంబులెన్స్‌కు కాల్ చేయడం.. ఆటో కోసం తిరగడం ఈ గ్యాప్‌లో సుమారు అరగంటకు పైగా సమయం వృథా అయిపోయింది. వేణుగోపాల్‌కు అప్పటికే తీవ్ర రక్తస్రావమైంది. ఎట్టకేలకు ఆటో అయితే వచ్చింది.. వెంటనే తండ్రిని ఆటోలో ఆ ఇద్దరే కూర్చోబెట్టి ఆస్పత్రి తీసుకెళ్లడానికి యత్నించారు. అయితే మార్గమధ్యలోనే ఘోరం జరిగిపోయింది. సరిగ్గా కొద్దిసేపట్లో ఆస్పత్రికి చేరుకుంటాం.. నాన్న మళ్లీ మామూలు మనిషవుతారని ఆ ఇద్దరు కుమార్తెలు అనుకున్నారు. అయితే మార్గమధ్యలోనే ఆయన కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
క్షమాపణ చెప్పిన ఓలా..!
ఓలా క్యాబ్ నిర్వాకానికి ఓ నిండు ప్రాణం పోయింది!. ఒక్క నిమిషం ఆలోచించి.. ఆ డ్రైవర్ పెద్ద మనసు చేసుకుని ఉండుంటే ప్రాణాలు దక్కేవి కానీ కనికరంలేని డ్రైవర్ చేసిన పనితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ విషాద గాధను వేణుగోపాల్ కుమార్తె సింధూర ఫేస్‌బుక్‌లో సాక్ష్యాలతో వివరిస్తూ ఓలాకు పోస్ట్ చేసింది. కారు నంబర్, డ్రైవర్ పేరు ఇలా అన్ని వివరాలను ఆ పోస్ట్‌లో సింధూర జతచేసింది. ఆమె కన్నీటి గాథను విన్న సదరు ఓలా యాజమాన్యం రిప్లై ఇచ్చింది. విషయం తెలుసుకుని సింధూరకు ఫోన్ చేసి మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి అని చెప్పిన యాజమాన్యం వెంటనే ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించింది.
"మా కుటుంబంలో నెలకొన్న విషాదం మరే కుటుంబానికి రావొద్దనే సామాజిక మాధ్యమాల్లో వివరాలు పోస్టు చేయాల్సి వచ్చింది" అని సింధూర తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, జనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్, 108 సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోతున్న టైమ్‌లో శుభ్రత గురించి ఆలోచించడమేంటి..? ఇది పిచ్చి అనుకోవాలా లేకుంటే ఇంకేమనుకోవాలి..? కడిగితే కారు శుభ్రమవుద్ది అంతే గానీ.. పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా..! అందుకే ఇలాంటి అత్యవసర సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి డ్రైవర్స్.. ఇంతకు మించి చెప్పడానికేమీ లేదని నెటిజన్లు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout