Flood Water:విజయవాడ -హైదరాబాద్ హైవే మీదుగా వరద .. నిలిచిన రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, మరి గమ్యస్థానాలకు ఎలా..?
- IndiaGlitz, [Friday,July 28 2023]
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ప్రాజెక్ట్ల్లోకి వరద నీరు పోటెత్తడంతో దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక ఏపీ- తెలంగాణ మధ్య ప్రధాన రహదారి అయిన ఎన్హెచ్ 65 వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వుండటంతో అధికారులు వాహనాలను నిలిపివేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నుంచి విశాఖ ఇలా వెళ్లాలి :
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలను గుంటూరు మీదుగా మళ్లించారు. అలాగే హైదరాబాద్ - విజయవాడ, విజయవాడ - హైదరాబాద్, హైదరాబాద్ - విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు హైదరాబాద్ – నార్కెట్ పల్లి – మిర్యాలగూడ – దాచేపల్లి – పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి – విశాఖపట్నంకు వెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్ళాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఎప్పటికప్పుడు మార్పులు గమనించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సూచించారు. ట్రాఫిక్ సమాచారం కోసం పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గురువారం సాయంత్రానికి హైవేపైకి భారీ వరద :
ఖమ్మంలో భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో మున్నేరు వాగు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో గురువారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు. కీసర టోల్ గేట్ దాటిన తర్వాత ఐతవరం వద్ద హైవేపై నీరు ప్రవహిస్తోంది. అప్పటికే వరదలో చిక్కుకున్న వాహనాలను క్రేన్ సాయంత్రం రక్షించారు పోలీసులు.