Hyderabad Police : డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, మైనర్లయితే తల్లిదండ్రులు జైలుకే

  • IndiaGlitz, [Friday,June 10 2022]

మొన్నటి దాక మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిని కంట్రోల్ చేయడానికి జరిమానాలు విధించడం.. వాహనాలు సీజ్ చేయడం.. కౌన్సెలింగ్ ఇవ్వడం వంటితో సరిపెట్టేవారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. కానీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతుండటంతో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా.. ఇప్పటినుంచి మద్యం తాగి ఎవరైనా డ్రైవ్ చేస్తే వారికి మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు మరిన్ని శిక్షలకు గురికానున్నారు.

ప్రతి కేసూ కోర్టులో నమోదు.. భవిష్యత్తుకు ఇబ్బందులే:

ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కిన వారి వివరాలు కోర్టుకు సమర్పించి లైసెన్స్‌ రద్దు ఉత్తర్వులను రవాణా శాఖకు పంపించనున్నారు. అలాగే మద్యం మత్తులో ప్రమాదాలు పెరుగుతుండడంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలనూ పెంచనున్నారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దయితే ఏం కాదులే అని ఊరుకుంటే వాహనదారులు పప్పులే కాలేసినట్లే. ఎందుకంటే పరిమితికి మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలొస్తాయి.

నేరానికి సంబంధించి కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు వెరిఫికేషన్ సమయంలో ఈ కేసులు ప్రతిబంధకాలవుతాయి. అంతేకాదు.. విదేశాలకు వెళ్లేందుకు కూడా అవకాశం వుండదు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దవుతుందని.. తీవ్రత అధికంగా వున్న పక్షంలో శాశ్వతంగానూ రద్దవ్వొచ్చని నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త కమీషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

మైనర్లపై ప్రత్యేక నిఘా:

ఇటీవల నగరంలో మైనర్ల ఆగడాలు శృతిమించడంతో వారిపై ఓ కన్నేసి వుంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌లో అమ్నేషియా పబ్ అత్యాచారం నేపథ్యంలో మెర్సిడెస్‌ బెంజ్‌, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపారని తేలడంతో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు మోటారు వాహన చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపించనున్నారు. మైనర్లు కార్లను వేగంగా నడిపి ప్రమాదాలు చేస్తుండటంతో పాటు కిడ్నాప్‌లు.. అత్యాచార యత్నాలకు కార్లు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కార్లు, బైకులు నడుపుతోన్న 14 ఏళ్ల పిల్లలు:

ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడినా.. సీసీ కెమెరాలకు చిక్కినా వారిపై కేసులు నమోదు చేయనున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 14 ఏళ్ల పిల్లలూ కార్లు, బైకులు నడుపుతున్నారన్న సమాచారంతో సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలపై చట్టపరంగా వ్యవహరించాలని, మైనర్లపై కోర్టుల్లో ఛార్జిషీట్ సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.