Hyderabad: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి.. తెరపైకి కొత్త డిమాండ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అధికార వైసీపీ కొత్త రాగం అందుకుంది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌తో ఈ గడువు ముగిసిపోతుంది. దీంతో వైసీపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. గడువు ముగిసినా కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని.. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. జూన్‌తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడగించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పుకొచ్చారు. దీంతో వైవీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనంతపురంలో స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిస్తే మంచిదే అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీలో కీలక నేతలైన వైవీ, పెద్దిరెడ్డి ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయ కాదని.. పార్టీ విధానం ప్రకారమే మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
వాస్తవంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా ఏపీలోని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఇక్కడ నుంచి పరిపాలించలేదు. తమ సొంత రాష్ట్రం నుంచే పరిపాలిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయారు. అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం కట్టి అక్కడి నుంచే పాలిస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి నుంచే పాలిస్తూ వస్తోంది. కానీ మూడు రాజధానులు అంటూ అమరావతిని పూర్తి చేయలేదు. ఇప్పుడు సడెన్‌గా ఉమ్మడి రాజధాని కొనసాగించాలని వాదన తీసుకురావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
మరోవైపు జగన్ సీఎంగా అయిన వెంటనే ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్లో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఎలాంటి భవనాలు తీసుకోలేదు. దీంతో ప్రజలు కూడా ఉమ్మడి రాజధాని అనే విషయం మర్చిపోయారు. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లు ఉండి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే వాదనను వైసీపీ నేతలు తీసుకురావడం ఎన్నికల స్టంట్ అని తెలంగాణ నాయకులు విమర్శిస్తున్నారు.
ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలని అది సాధ్యం కాదని గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ సమాజం దీనిని అసలు అంగీకరించదని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశం పేరుతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments