Hyderabad: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి.. తెరపైకి కొత్త డిమాండ్..

  • IndiaGlitz, [Tuesday,February 13 2024]

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అధికార వైసీపీ కొత్త రాగం అందుకుంది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌తో ఈ గడువు ముగిసిపోతుంది. దీంతో వైసీపీ నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. గడువు ముగిసినా కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని.. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. జూన్‎తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పొడగించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పుకొచ్చారు. దీంతో వైవీ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

అయితే ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అనంతపురంలో స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిస్తే మంచిదే అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీలో కీలక నేతలైన వైవీ, పెద్దిరెడ్డి ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయ కాదని.. పార్టీ విధానం ప్రకారమే మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

వాస్తవంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా ఏపీలోని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఇక్కడ నుంచి పరిపాలించలేదు. తమ సొంత రాష్ట్రం నుంచే పరిపాలిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయారు. అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం కట్టి అక్కడి నుంచే పాలిస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి నుంచే పాలిస్తూ వస్తోంది. కానీ మూడు రాజధానులు అంటూ అమరావతిని పూర్తి చేయలేదు. ఇప్పుడు సడెన్‌గా ఉమ్మడి రాజధాని కొనసాగించాలని వాదన తీసుకురావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

మరోవైపు జగన్ సీఎంగా అయిన వెంటనే ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్‌లో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఎలాంటి భవనాలు తీసుకోలేదు. దీంతో ప్రజలు కూడా ఉమ్మడి రాజధాని అనే విషయం మర్చిపోయారు. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లు ఉండి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే వాదనను వైసీపీ నేతలు తీసుకురావడం ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ నాయకులు విమర్శిస్తున్నారు.

ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలని అది సాధ్యం కాదని గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ సమాజం దీనిని అసలు అంగీకరించదని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశం పేరుతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

More News

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవంను లవర్స్ ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటారు. తమ ప్రియుడు, ప్రియురాలితో కలిసి ఆరోజు సంతోషంగా గడుపుతుంటారు. ఆ రోజును సంవత్సరమంతా

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతుల మెగా మార్చ్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు వేలాది

Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి పవన్ కల్యాణ్ సిద్ధం.. ఇక్కడి నుంచే శ్రీకారం..

ఎన్నికల కురుక్షేత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎన్నికల బరిలో దిగారు.

CM Revanth Reddy: కాళేశ్వర్‌రావు కోసం హెలికాఫ్టర్‌ సిద్ధం.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు..

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. ఎంఐఎం సభ్యులు కూడా వీరితో పాటు వెళ్లారు.

Amit Shah: చంద్రబాబు ముందు అమిత్ షా కొత్త ఫార్ములా.. వర్క్‌వుట్ అవుతుందా..?

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరికొన్ని ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తుంటే..