భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పోలీసుల సూచనలు విన్నారా..?
- IndiaGlitz, [Wednesday,February 23 2022]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. తొలుత సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమం.. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం కారణంగా వాయిదా పడింది. దీంతో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో ఇందుకు ఏర్పాట్లు చేశారు.
గతంలో ఇదే స్థలంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అభిమానుల మధ్య గొడవలు, తొక్కిసలాటలు వంటివి జరగడంతో ఈసారి పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో నగర పోలీసులు ముందుగానే ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు కొన్ని నిబంధనలను విడుదల చేశారు. ఈవెంట్‌కి హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పోలీసుల సూచనలు
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్నవారికి మాత్రమే లోనికి అనుమతి.
తొలుత ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవు. కొత్త పాసులు వుంటేనే అనుమతి.
వ్యక్తిగత వాహనాలలో కాకుండా ప్రజా రవాణా ద్వారా వేదిక వద్దకి చేరుకుంటే మంచిది.
పాసులు లేనివారు గ్రౌండ్ వద్దకు వచ్చి గుమిగూడవద్దు. పాసులు లేకుంటే రాకపోవడమే మంచిది.
పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే చట్టపరంగా చర్యలు
ప్రీ రిలీజ్ కార్యక్రమం నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ వుంటుంది. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులు ఎంపి చేసుకుంటే మంచిది
జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసుఫ్‌గూడ వైపు వెళ్లే వాళ్ళు కమలాపురి కాలనీ రోడ్డు వైపు
అమీర్ పేట్ నుంచి యూసుఫ్‌గూడ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వారు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ రోడ్డు, ఇందిరా నగర్ రహదారి మీదుగా వెళ్తే బెటర్.
ప్రీ రిలేజ్ ఈవెంట్ కోసం వచ్చిన వారు వాహనాలను రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు పార్క్ చేస్తే చర్యలు.