హైదరాబాదీలకు బంపరాఫర్.. రూ.59తో మెట్రోలో రోజంతా ప్రయాణం, కానీ..?

  • IndiaGlitz, [Thursday,March 31 2022]

ప్రజలను ట్రాఫిక్ కష్టాలకు దూరంగా, సుఖమయ, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది. అయితే భారీ ఛార్జీల కారణంగా కొందరు మెట్రో ఎక్కాలంటే జేబు తడుముకుంటున్నారు. అలాంటిది కేవలం రూ.59కి రోజంతా నగరం మొత్తం ప్రయాణించే ఛాన్స్ దొరికితే... ఎగిరి గంతేస్తారు కదూ.

నగర ప్రజలకు హైదరాబాద్‌ మెట్రో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మెట్రో రైల్లో ‘సూపర్ సేవర్‌ కార్డు’ పేరుతో కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి సూపర్ సేవర్‌ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవు దినాల్లో కేవలం రూ.59తో రోజంతా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవు దినాల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు.

సెలవులివే..

ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే (డిసెంబరు 26), బోగీ, సంక్రాంతి, శివరాత్రి

కాగా.. కరోనా కారణంగా హైదరాబాద్ మెట్రో రైల్ భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనాకి ముందు ఉన్న రద్దీ మెట్రోలో కనిపించడం లేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా ప్రయాణికుల రద్దీ 25 శాతానికి పైనే పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం మెట్రోకు శరాఘాతంలా తగిలింది. ఈ చార్జీల ప్రభావం మెట్రోపై పడుతుందని ఎల్అండ్‌టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీలు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతోంది.