Vijayalakshmi:కాంగ్రెస్ పార్టీలో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించుకోలేకపోయింది. అందుకే అధికారంలోకి రాగానే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్, సిట్టింగ్ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో మజ్లిస్ పార్టీ సహాయంతో త్వరలోనే హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేవంత్ సర్కార్ పావులు కదపుతోంది. ఇదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ మీద ఉన్న పట్టు కోల్పోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు కూడా హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. వీరి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
దీంతో కేసీఆర్‌కు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ బాస్‌కు కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలు పార్టీని వీడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు కవిత అరెస్ట్.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాల కేసులు, ఇంకోవైపు నేతల వలసలతో బీఆర్ఎస్ పార్టీ కకావికలమవుతోంది. మరి ఇన్ని ఇబ్బందులను అధిగమించి పార్టీని కాపాడుకుని తిరిగి గాడిన పెట్టడం కేసీఆర్ కుటుంబానికి కత్తి మీద సాము లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout