జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ టీకా అభివృద్ధికి హైదరాబాదీ కంపెనీ సాయం

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ క్రమంగా గ్లోబల్ హబ్‌గా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రెండు వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తున్నారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తయారు చేస్తోంది.

తాజాగా మరో వ్యాక్సిన్‌ను సైతం హైదరాబాదీ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోంది. ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధృవీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

జాన్సన్ అండ్ జాన్సన్.. ఇదివరకే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆ కంపెనీకి చెందిన జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒప్పందాన్ని బయోలాజికల్ ఈతో త్వరలోనే కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంద. ప్రతి సంవత్సరం 60 కోట్ల జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోనున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటనలో తెలిపింది.