భాగ్యనగరంలో బోనాల జాతరకు ముహూర్తం ఖరారు.. తేదీలు ఇవే, నెల రోజులూ పండుగే

  • IndiaGlitz, [Monday,June 06 2022]

హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పర్వదినాల్లో బోనాలు ఒకటి. ప్రతియేటా ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల కోసం ఆడపడుచులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌లు క‌లిసి బోనాల వేడుక‌పై స‌మీక్ష నిర్వ‌హించి, తేదీల‌ను ఖరారు చేశారు.

గోల్కొండ బోనాలతో ఉత్సవాలు మొదలు:

ఈ నెల 30న గోల్కొండ బోనాల‌తో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు, 18న రంగం, భ‌విష్య‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. జులై 24న భాగ్య‌న‌గ‌ర బోనాలు, 25న ఉమ్మ‌డి దేవాల‌యాల ఘ‌ట్టాలు ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు. జులై 28న గోల్కొండ బోనాల‌తో వేడుకలు ముగియ‌నున్నాయి.

తలసాని ఆధ్వర్యంలో సమీక్ష:

ఆషాఢ బోనాలకు సంబంధించి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.