తూర్పుగోదావరిలో తెలుగుదేశంకు భారీ షాక్!

  • IndiaGlitz, [Thursday,August 29 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీకి.. వరుస ఎదురుదెబ్బలు తప్పట్లేదు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశంకు భారీ షాక్ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి టాటా చెప్పేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాదు.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ మొదట్నుంచీ..!

‘టీడీపీకి మనుగడ లేదు.. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని గుర్తించడంలో టీడీపీ ఘోరం వైఫల్యం చెందింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు రావట్లేదు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయింది. నేనెప్పుడో టీడీపీ నుంచి బయటికి రావాలని అనుకున్నాను. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాపుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారు’ అని రాజా చెప్పుకొచ్చారు. రాజా మాటలను బట్టి చూస్తే.. వైసీపీ కండువా కప్పుకోవడం పక్కా అని తెలుస్తోంది. మరి ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.