Pawan Kalyan:కదిలొచ్చిన జనవాహిని .. జనసేనాని అడుగులో అడుగై, ఏలూరులో వారాహి యాత్రకు బ్రహ్మరథం
- IndiaGlitz, [Monday,July 10 2023]
రెండో విడత వారాహి విజయయాత్ర ఏలూరులో ఆదివారం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌కు నగర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆరు కిలోమీటర్లు.. రెండున్నర గంటలపాటు నగర వీధుల గుండా ప్రతి అడుగు ప్రజల హర్షాతిరేకాల మధ్య సాగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిని బైపాస్ రోడ్డులోని క్రాంతి ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్.. మిని బైపాస్, గ్రీన్ సిటీ, సత్రంపాడు, సీఆర్ రెడ్డి కళాశాల, కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ మీదుగా కదిలారు. వారాహి విజయ యాత్ర బహిరంగ సభా స్థలికి రెండు కిలోమీటర్ల ముందు నుంచి ప్రతి అడుగుకీ జనవాహిని రెట్టింపు అవుతూ వచ్చింది. ఏలూరుతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
అట్రాక్షన్‌గా నిలిచిన బ్యానర్లు, హోర్డింగ్‌లు :
మరోవైపు.. పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతూ ఏలూరులో ఏర్పాటు చేసిన బ్యానర్లు, హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాలు తెలియజేస్తూ భారీ హోర్డింగులు వెలిశాయి. ఏలూరులోని ప్రతి కూడలిలో పవన్ కళ్యాణ్‌కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ప్రయత్నించారు. కొంత మంది పోస్టర్ల రూపంలోనే సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఏలూరు ప్రజానీకంలో వచ్చిన మార్పుకి సంకేతంగా ప్రతి పోస్టర్ లో మార్పు మొదలయ్యింది అన్న పదాన్ని చేర్చారు.. హల్లో ఆంధ్ర.. బైబై వైసీపీ నినాదాలు కూడా మిన్నంటాయి.
నెలల బిడ్డతో పవన్‌ను చూసేందుకు :
క్రాంతి ఫంక్షన్ హాల్ వెలుపల ఓ తల్లి తన నెలల శిశువుతో పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చింది. కారు మీద నిలబడి తన పొత్తిళ్లలో బిడ్డను జనసేనాని చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించగా ఆయన ఆ శిశువును చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. ఏలూరులో మొదలైన మలివిడత వారాహి విజయ యాత్ర ఘనమైన అడుగుతో ప్రారంభం కాగా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.