ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌కు భారీ జరిమానా.. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది. ఓ సంస్థతో పాటు ఆ సంస్థకు చెందిన వ్యక్తిపై ఊహించని జరిమానా విధించడం సంచలనంగా మారింది. ఎంబీఎస్ జ్యువెల్లరీస్, దాని యజమాని సుఖేశ్ గుప్తాలకు ఈడీ మంగళవారం భారీ జరిమానా విధించి షాక్ ఇచ్చింది. ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌కు రూ.222.44 కోట్ల భారీ జరిమానా విధించగా.. సుఖేష్ గుప్తాకు రూ.22 కోట్ల జరిమానా విధిస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో సుఖేష్ గుప్తా ట్రాన్సాక్షన్‌ నిర్వహించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. హాంకాంగ్‌కు చెందిన లింక్‌పై కంపెనీకి డైమండ్లు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడుల చట్టాలను సుఖేష్ గుప్తా ఉల్లంఘించి ఈ ట్రాన్సక్షన్‌ను నిర్వహించినట్టు వెల్లడవడంతో ఈడీ ఆయనపై కొరడా ఝుళిపించింది. ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఈడీ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

హాంకాంగ్‌కు చెందిన లింక్‌‌ఫై కంపెనీతో ఎంబీఎస్ జ్యువెల్లరీస్ డైమండ్ల సరఫరా లావాదేవీలు కొనసాగించింది. హాంకాంగ్‌‌కు డైమండ్‌ ఎక్స్‌‌పోర్ట్‌ చేసిన విషయం మీద ఫెమా కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో ట్రాన్సాక్షన్‌ చేసి సుఖేష్ గుప్తా.. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారు. ఈ కేసును సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఈడీ చివరికి సంస్థ చరిత్రలో అతి భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువరించింది.