China:చైనాలో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి..
- IndiaGlitz, [Tuesday,December 19 2023]
చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం(China Earthquake) సంభవించింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత ధాటికి 111 మంది మృతి చెందగా.. వందల మంది గాయడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైందని స్థానిక మీడియా తెలిపింది. గన్సు ప్రావిన్స్‌లో సుమారు 100 మంది మరణించగా.. పొరుగునే ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో మరో 11 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయానని, గణనీయమైన ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ప్రాణభయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారని చెప్పింది.
మరోవైపు విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డాయంది. ఈ భూకంపం కేంద్రం గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించామని, కింగ్‌హై ప్రావిన్స్ సరిహద్దుకు సమీపంలో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక ఈ ఘోర ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Jinping) స్పందించారు. భూకంప ప్రాంతాల్లో అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
చైనాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2008లో ఏకంగా 7.9 తీవ్రతతో నమోదైన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏకంగా 5,335 మంది పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 87,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికి పెద్ద సంఖ్యలో భవనాలు కూలాయి. సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించగా సుమారు 100 మంది మృత్యువాతపడ్డారు.