దేశంలో షాకిచ్చిన కరోనా.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు ఇదే తొలిసారి..

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు కరోనా కేసుల సంఖ్య షాకిచ్చింది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 52,123 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. మరణాల సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే నమోదవుతూ వస్తోంది.

గడిచిన 24 గంటల్లో 775 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకూ 34,968 మంది మృతి చెందారు. మరణాల సంఖ్యలో ఇండియా ప్రపంచంలోనే ఐదవ స్థానానికి చేరువవుతుండటం గమనార్హం. 35,100 మరణాలతో ఇటలీ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది. కాగా.. దేశంలో తాజాగా 32,553 మంది కోలుకోగా.. ప్రస్తుతం కోలుకున్న వారి సంఖ్య 10,20,582కు చేరుకుంది. ఐదు లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అయితే దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.51 శాతం ఉంది. మరణాల రేటు 2.21 శాతంగా ఉంది.