పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా? : పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా మోటార్స్’ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ సోషల్ మీడియాలో.. మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా టీడీపీనే చేస్తోందని వైసీపీ తీవ్ర ఆగ్రహం చేస్తోంది. ఈ వ్యవహారం ఏపీ నుంచి పార్లమెంట్ వేదికగా పెద్ద చర్చే జరిగింది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చర్యలతో కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయన్నారు. ఉన్న సంస్థలే వెళ్లిపోతుంటే ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఆషామాషీ కాదు!
‘కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి అని వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ వార్తను ప్రపంచానికి తెలియచేసింది ఏదో ఆషామాషీ సంస్థ కాదు. 'రాయిటర్స్' అనే ప్రఖ్యాత వార్తా సంస్ధ వెల్లడించింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇక్కడ బహుముఖంగా తన ప్లాంట్ విస్తరిస్తుంది అనుకొంటే ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేందుకు సిద్దపడటం రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాలను తెలియచేస్తోంది’ అని అన్నారు.
ఉన్నవీ తరలిపోతుంటే..!
‘విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించడం ఆ రంగం ఇకపై ఆంధ్ర ప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే అవుతుంది. ఒక సంస్ధ నూతనంగా పెట్టుబడి పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్ధికాభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది. ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో కాగితం పరిశ్రమ స్థాపిస్తామని ఒప్పందం చేసుకున్న ఏషియన్ పేపర్స్ అండ్ పల్ప్ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్ళిపోయింది. ఇలా రాష్ట్రానికి రావాల్సినవి, ఇప్పటికే ఉన్నవీ తరలిపోతుంటే ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్ధులు, కూల్చివేతలు, తరలింపులు అంటోంది. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలక పక్షాన్ని చూసే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అని ప్రభుత్వం గ్రహించాలి’ అని పవన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout