జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసిపోయింది!
- IndiaGlitz, [Monday,April 01 2019]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లొస్తాయ్.. అన్ని సీట్లొస్తాయ్ అని జాతీయ మీడియా మొదలుకుని ప్రాంతీయ మీడియా సంస్థలు ముఖ్యంగా పలువురు జ్యోతిష్యులు చెబుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యవహారంపై ఇంత వరకూ అటు టీడీపీ, వైసీపీ స్పందించినప్పటికీ జనసేన మాత్రం స్పందించలేదు. తాజాగా విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎన్నికల ప్రచారంలో స్పందించారు.
మాకు ఎన్ని సీట్లంటే..!
సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. జనసేనకు 85 నుండి 125 సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు జనాల్లో జనసేన నిశ్శబ్ద విప్లవంగా మారి అద్భుత ఫలితాల్ని రాబడుతుందన్నారు. పౌరుల భవిష్యత్తు కోసం జనసేన మేనిఫెస్టో రూపకల్పన చేసి ముందుకు వెళ్తోందన్నారు. మార్పుకోసం జనసేన పనిచేస్తుందని.. ఓటర్ను గెలిపించడమే ఈ ఎన్నికల్లో జనసేన ముందున్న లక్ష్యమని మాజీ జేడీ చెప్పుకొచ్చారు.
చాలా సమస్యలు గుర్తించాం..!
ఎన్నికల ప్రచార పర్యటనల్లో కీలక సమస్యలను గుర్తించాను. విశాఖ మహా నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాహార్తి ఉంది. నీటి సమస్యను అధిగమించడానికి జనసేన అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి సమస్యను అధిగమిస్తాం. వైద్య సేవలు కూడా మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
లక్ష్మీనారాయణ మాటలు విన్న అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మాత్రం అవునా..? నిజమేనా.. క్లీన్ స్వీప్ అని చెప్పేయచ్చుగా ఒక్కమాటతో పోయిద్ది అంటూ సెటైర్లు వర్షం కురిపిస్తు్న్నారు. అయితే అసలు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేలాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.