జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలాబలాలివే..
- IndiaGlitz, [Sunday,November 29 2020]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. వారం రోజుల పాటు ఆయా పార్టీల అభ్యర్దులు తమ ప్రచారంలో భాగంగా వందల సంఖ్యలో కార్యకర్తలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్రనాయకత్వం సైతం ప్రచారంలో పాల్గొనడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు తమ మేనిఫెస్టోలతో.. హామీలతో ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో వారం రోజులగా హైదరాబాద్ నగరంలో హోరెత్తిపోయింది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ఒక్కసారి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల బలాబలాలు చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 కార్పొరేటర్లు + 52 ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపి మొత్తంగా 202 ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ గెలవాలి అంటే ఎక్స్ అఫిషియో ఓట్లు( ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి) - 38 ఓట్లు ఉన్నాయి. ఇంకా 64 డివిజన్లు గెలిస్తే చాలు మేయర్ పీఠం టీఆర్ఎస్ను వరిస్తుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 99 డివిజన్లను గెలుచుకుంది. మరి ఈసారి ఎన్ని డివిజన్లను గెలుచుకుంటుందో చూడాలి.
ఇక ఎంఐఎం పార్టీకి ఎక్స్ అఫిషియో ఓట్లు 10 ఉన్నాయి. ఈ పార్టీకి మేయర్ పీఠం దక్కాలంటే 92 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక బీజేపీకి ఎక్స్ అఫిషియో ఓట్లు 3 ఉన్నాయి.99 డివిజన్లలో కమలం జెండా ఎగిరితేనే బీజేపీని మేయర్ పీఠం వరిస్తుంది. ఈ మూడు పార్టీల కంటే తక్కువగా కాంగ్రెస్‌కు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఈ పార్టీకి కేవలం ఒకే ఒక ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. అది కూడా ఎంపీ రేవంత్‌కు మాత్రమే. దీంతో ఈ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 101 డివిజన్లలో విజయం సాధించాలి. మొత్తంగా చూస్తే విజయావకాశాలు ఎక్కువగా టీఆర్ఎస్కే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ సెంచరీ కొడితే మాత్రం ఆ పార్టీకి తిరుగుండదు. ఓటరు తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి.