హాట్ టాపిక్ : వకీల్ సాబ్ ని మినిస్టర్ సాబ్ చేసేందుకు ప్రయత్నాలు?
- IndiaGlitz, [Tuesday,June 15 2021]
నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు. కేంద్రంలో నరేంద్ర మోడీ తన కేబినెట్ ని విస్తరించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి జోరుగా ప్రచారం మొదలైంది. ఢిల్లీలో బిజెపి అధినాయకత్వం పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించి పవన్ కి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టాలని ఢిల్లీలో బిజెపి హై కమాండ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ఇస్తున్నారు. మధ్యలో ప్రత్యేక హోదా విషయంలో విభేదించినప్పటికీ తిరిగి బిజెపితోనే పవన్ జట్టు కట్టారు.
ఓ సందర్భంలో జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా కోరారని, తాను సున్నితంగా తిరస్కరించినట్లు పవన్ తెలిపారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో జనసేన, బిజెపి మధ్య పొత్తు కొనసాగుతోంది. నార్త్ లో అక్కడక్కడ ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ బిజెపి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
కానీ సౌత్ లో పార్టీని విస్తరించడం బిజెపి పెద్దలకు కత్తిమీద సాముగా మారింది. ఏపీలో పవన్ కళ్యాణ్ రూపంలో బిజెపికి ఒక హోప్ లభించింది. ఇక ఏపీ నుంచి మోడీ కేబినెట్ లో ఎవరూ లేరు. పవన్ కి మంత్రి పదవి ఇస్తే అటు జనసేనతో పాటు బిజెపికి కూడా ఏపీలో మైలేజి వస్తుందని భావిస్తున్నారట. దీనిపై ఢిల్లీ పెద్దలు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇది అంత సులువుగా అయ్యేలా కనిపించడం లేదు. ఎవరైన మంత్రి పదవిలో కొనసాగాలంటే కొన్ని నెలల్లో లోక్ సభకు కానీ, రాజ్యసభకు కానీ ఎన్నికవ్వాలి. లోక్ సభకు ఎన్నికయ్యే ఛాన్స్ పవన్ కి ఇప్పుడు లేదు. ఇక రాజ్యసభకు ఎన్నికకావడం అంత సులభం కాదు.
పవన్ కి కేంద్రమంత్రి పదవి గురించి చర్చ జరగడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. మరి జనసేన కానీ, బిజెపి కానీ ఈ వార్తలపై స్పందిస్తాయేమో చూడాలి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలతో బిజీ అయిపోయారు. రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి హరిహరవీరమల్లు, అయ్యప్పన్ కోషియం, PSPK 28(వర్కింగ్ టైటిల్) లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.