'హోరా హోరి' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఉన్నదున్నట్టు మాట్లాడే దర్శకుడు తేజ. మంచయినా, చెడయినా ముఖం మీద చెప్పగలగడం గొప్ప విషయమే. చిత్రం, జయంతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ తెరకెక్కించిన తాజా సినిమా హోరాహోరీ. `ఈ మధ్య కాస్త మొహమాటాలకు పోయాను. వాటన్నిటినీ వదిలేసి ఇప్పుడు నేను నేనుగా తెరకెక్కించిన సినిమా హోరాహోరీ. ఎవరైనా జయంతో పోలిస్తే నాకు చిరాకొస్తుంది. అయితే ఈ సినిమాను చూస్తే జయం ఛాయలు నాకు కనిపిస్తున్నాయి` అని చెప్పాడు తేజ. ఇంతకీ శుక్రవారం విడుదలైన హోరాహోరీలో నిజంగా జయం ఛాయలు కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపిస్తే ఏ అంశాల్లో? హోరాహోరీ ఎవరికి ఎవరితో ఎందుకు జరిగింది? వంటి అంశాలన్నీ తెలియాలంటే హోరాహోరీ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.
కథ
మైథిలి (దక్ష) ఏసీపీకి చెల్లెలు. మైథిలి తండ్రి సీఐగా పనిచేస్తుంటాడు. తండ్రీ, కొడుకులు ఇద్దరూ లంచగొండులే. నడిరోడ్డుమీదే బసవ (చస్వా) ఒక ఫ్యామిలీని చంపేస్తాడు. ఆ హత్యల తాలూకు సాక్ష్యాలను కొట్టయడానికి మైథిలి తండ్రీ, అన్న కలిసి పాతిక లక్షలు అడుగుతారు. మైథిలి పెళ్లిలో ఆ మొత్తాన్ని తెచ్చిస్తాడు బసవ. అక్కడ మైథిలి నచ్చడంతో పెళ్లికొడుకును చంపిస్తాడు. అలాగే మరో పెళ్లి కొడుకును కూడా చంపిస్తాడు. దీంతో మైథిలి డిప్రషన్‌కు వెళ్తుంది. ఆమెను ప్రశాంతమైన వాతావరణానికి తరలించమని వైద్యులు సూచిస్తారు. దాంతో నిత్యం వర్షం పడే ఆగుంబెకు తరలిస్తారు. అక్కడ ఆమెకు స్కంథ (దిలీప్) పరిచయమవుతాడు. ఓ పందెంలో మైథిలి, స్కంథకి సాయం చేయాల్సి వస్తుంది. అతని చేరువలో ఆమె కాస్త సాంత్వన పొందుతుంది. అయితే ఆమె మూలంగానే అతను ఓ విపరీతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దాన్నుంచి బసవ అతన్ని బయట పడేస్తాడు. ఇంతకీ బసవకు స్కంథ ఎవరో తెలుసా? బసవ ప్రేమించిన మైథిలి, స్కంథను ప్రేమించిందా? లేదా? స్కంథ తీసుకున్న ఆ విపత్కర నిర్ణయం ఏమిటి? స్కంథ, బసవ మధ్య పరిచయం ఎలా కలిగింది? వారిద్దరు మైథిలి విషయంలో పరస్పరం ఎలా స్పందించారు? అవినీతి పోలీసులు మారారా? లేక అలాగే లంచగొండులుగానే ఉన్నారా? ఇంతకీ వేలుస్వామి ఎవరు? ఇదంతా మిగిలిన కథ.
ప్లస్ పాయింట్లు
తేజ సినిమా అనగానే ఏదో ఒక విషయంలో కొత్తదనం తప్పకుండా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో కొత్తదనం కనిపిస్తుంది. ఫోర్త్ వాల్ టెక్నిక్‌ని ఈ చిత్రంలో ప్రవేశపెట్టారు. కొన్ని సన్నివేశాల్లో ఆ టెక్నిక్‌ని ప్రేక్షకుడు గుర్తించలేకపోవచ్చు. కానీ హీరో గోడదూకే సందర్భాల్లో తప్పకుండా గమనించగలుగుతాడు. కల్యాణి మాలిక్ సంగీతం చేసిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. అలాగే పెద్దాడ మూర్తి రాసిన పాటలు వినసొంపుగా, అర్థమయ్యేలా ఉన్నాయి. ఆగుంబె లొకేషన్ బావుంది. ఈ సినిమా కోసమే చేసిన రెయిన్ మెషిన్ కూడా నేచురల్‌గా అనిపిస్తుంది. స్కంథ బామ్మ అంజలీదేవి పాత్ర అందరికీ నచ్చుతుంది. ఏంది నా లడ్డూ అంటూ రాకెట్ రాఘవ చేసే కామెడీ, కూరలో కరివేపాకు అంటూ విలన్గ్యాంగ్లోని వ్యక్తి మేనరిజం, ధర్మసందేహం అనే మేనరిజం కొంతలో కొంత రిలీఫ్‌ని ఇచ్చే అంశాలు.
మైనస్ పాయింట్లు
సినిమా చాలా స్లోగా నడుస్తుంది. ఎడిటింగ్ బాలేదనే చెప్పాలి. దక్ష సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం సంగతి సరే. కానీ ఆమె గొంతు మొరటుగా ఉంది. స్కంథ అత్త పాత్ర ఓకే. మామ పాత్ర ఎందుకో అర్థం కాదు. ఓ సందర్భంగా మైథిలి నాన్నమ్మ, మైథిలి తాతతో `పిల్ల నిద్రపోయింది నేను పైకిరానా (మంచం మీదకు) అని అడుగుతుంది. ఆ డైలాగు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అస్తమానం స్కంథ ఏడవడం బాగా అనిపించదు. ఓవరాల్‌గా డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.
విశ్లేషణ
ఈ సినిమాతో తేజ చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసిన మాట నిజమే. కానీ సినిమాలో ఎవరు ఎవరో త్వరగా గుర్తుబట్టడం కష్టం. ఆర్ట్ సినిమాకు, కమర్షియల్ సినిమాకూ మధ్య ఉన్న లైన్‌ను బ్రేక్ చేసే ఆథంటిక్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని తేజ పదే పదే చెప్పారు. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. డి.ఎస్.రావు ముఖంలో అసలు ఏ భావమూ పలకలేదు. హీరోయిన్ అన్నయ్య పాత్రధారికి మంచి మార్కులు పడతాయి. అందమైన విలన్లను చూసిన తెలుగువారికి చస్వా చూడగానే నచ్చడు. కానీ చూసేకొద్దీ అతని నటన బాగా నచ్చుతుంది. జయం సినిమా ప్రభావం మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. అలాగే జండాపై కపిరాజు ఉంటే జయం తథ్యం అని అనుకున్నాడేమో మొదటి, రెండో సీనుల్లోనే తేజ జండాపై కపిరాజును చూపించాడు. మేకప్ లేకుండా, లైట్ లేకుండా తీసిన ఈ సినిమాకు ఆర్ట్ లుక్ వచ్చిందన్నది కాదనలేని నిజం. ఇందుమతి పాత్ర ఎందుకొచ్చిందో, ముందేలే ముందేలే పాట ఎందుకో, ఆ తర్వాత ఆ ఇందుమతి ఏమైందో అర్ధం కాదు. కొన్ని సీన్లు నడుస్తున్నప్పుడు వామ్మో అని థియేటర్లో జనాలు అరిచే అరుపులకు హాలంతా ఘొల్లుమనడం గమనించాల్సిన అంశం. దీనర్థం సినిమాలో కామెడీ కొరవడిందని, సెంటిమెంట్, ల్యాగ్ బాగా పెరిగిందని. ఏదేమైనా తేజ మాటల్లో ఉన్న స్పీడ్ సినిమాలో కనిపించలేదు.
బాటమ్ లైన్: హోరాహోరీ ప్రేక్షకుడికే!
రేటింగ్: 2/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout