Pawan Kalyan:తెలంగాణలో యువత ఆశలు నెరవేరలేదు: పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Monday,November 27 2023]
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్ రెడ్డి తరపున నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడ్డారని కానీ పదేళ్లు గడిచినా యువత ఆశలు నెరవేరలేదని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో నిలిచామని.. ఇరు పార్టీల అభ్యర్థులను గెలిపించాని పవన్ కోరారు. తమకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు జనసేనాని ధన్యవాదాలు తెలిపారు.
ఇక బీజేపీ జాతీయాధక్ష్యుడు జేపీ నడ్డా మాట్లాడుతూ జనసేనతో కలిసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల తలరాత మార్చుతుందన్నారు. బీఆర్ఎస్ ఓటమికి జనసేన, బీజేపీ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పలికేందుకు కమలం, గాజు గ్లాసు మీద పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. ప్రచారం రెండు రోజులు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని నడ్డా వెల్లడించారు.
మరోవైపు ఈ సభ వద్ద కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ జనసైనికులు ముందుకు దూసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.