AP Cabinet:కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- IndiaGlitz, [Friday,November 03 2023]
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 38 ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో కులగణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఇక 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అలాగే దేవాలయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజనకు ఆమోదం లభించింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అభిప్రాయపడింది.
జర్నలిస్టులకు ఈ సమావేశంలో శుభవార్త అందించింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం జగన్ సూచించారు. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం పడనుంది.
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. ఇక క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.