2021లో ధరల మోత మోగించనున్న గృహోపకరణాలు
- IndiaGlitz, [Monday,December 28 2020]
2021లో కరోనా మహమ్మారి మాటేమో కానీ.. ధరల పెరుగుదల మాత్రం ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి కీలకమైన గృహోపకరణాల ధరలు జనవరి నుంచి 10 శాతం మేరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే రాగి, అల్యూమినియం, స్టీల్ వంటి లోహాల ధరలతో పాటు సముద్ర, విమాన రవాణా చార్జీలు సైతం పెరగడమే ధరల పెంపునకు కారణమని తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు డిమాండ్‌కు తగినట్టుగా అంతర్జాతీయ వెండార్లు సరఫరాలు చేయలేకపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల ధరలు రెండు రెట్లు పెరిగాయి. అలాగే క్రూడాయిల్ ధరలు పెరగడంతో ప్లాస్టిక్ ధరలు కూడా పెరిగాయని వారు పేర్కొన్నారు.
ధరల పెరుగుదలపై స్పందించిన ఎల్‌జీ, పానాసోనిక్, థామ్సన్ ప్రతినిధులు.. ముడిసరుకు ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో గృహోపకరణాల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. సోనీ మాత్రం పరిస్థితిని ఇంకా సమీక్షిస్తున్నట్టు తెలిపింది. అయితే గృహోపకరణాల ధరలు పెరిగితే డిమాండ్ తగ్గే అవకాశాలు భారీగా ఉన్నాయని వినియోగదారుల ఎలక్ర్టానిక్స్, అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సియామా) హెచ్చరించింది. దీనిపై సియామా ప్రెసిడెంట్, గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ.. సముద్ర, వైమానిక రవాణా చార్జీలు ఐదారు రెట్లు పెరగడంతో కమోడిటీ ధరలు 20-25 శాతం పెరిగాయన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా గనుల తవ్వకం వంటి కార్యకలాపాలు కూడా భారీగా పడిపోవడం ఈ ఒత్తిడిని మరింతగా పెంచిందని తెలిపారు. అయితే వీటి కారణంగా ధరలు పెంచితే మాత్రం కొనుగోళ్ల డిమాండ్ తగ్గొచ్చని కమల్ నంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్తబ్ధంగా ఉన్న డిమాండ్‌ను పెంచుకోగలిగితే ఈ ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ ధరల ఒత్తిడి ఎంతో కాలం ఉండదని, వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకూ కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం గృహోపకరణాల మార్కెట్ పరిమాణం రూ.76,400 కోట్లుగా ఉండగా అందులో దేశీయ తయారీ రంగం వాటా రూ.32,200 కోట్లుగా ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది మాత్రం ధరల పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది.