ఎన్టీఆర్ బయోపిక్ కు హాలీవుడ్ బృందం
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్.` చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంచలన దర్శకుడు తేజ దర్శకుడు. బాలకృష్ణ సహా సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంగా.. చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మలచడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. రాత్రింబవళ్ళు కష్టపడి ఈ మూవీలో నటించబోయే 72 పాత్రలకి స్కెచ్ పనులను చూస్తున్నారు. అలాగే మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే...ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉన్న సుమారు 125 మంది ప్రముఖులతో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంది పరిశోధన బృందం. అంతేగాకుండా, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన నాలుగేళ్ళు, పదహారేళ్ళు, ఆ తరువాత దశ.. ఇలా మూడు దశలకి సంబంధించి ముగ్గురు నటులు కనిపిస్తారని.. మూడో దశ నుంచి బాలకృష్ణ కనిపిస్తారని తెలుస్తోంది. దాదాపు 20 రకాల గెటప్స్‌లో బాలయ్య కనిపించనున్నారని సమాచారం.
ఇదిలా వుంటే...ఈ సినిమా విషయంలో తేజ పనితనం బాలకృష్ణకి నచ్చడం లేదని కొన్ని రూమర్లు ఆ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని చిత్ర వర్గాలు ఖండించాయి. “ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీజర్ ను విడుదల చేయడానికి బాలకృష్ణ సహా అందరూ ప్రయత్నించాం. అయితే టీజర్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదు..వర్ధంతి అంటే అందరు బాధపడే విషయం...అందుకే టీజర్ విడుదలని వాయిదా వేసుకోమని కుటుంబసభ్యులు ఇచ్చిన సలహా మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. సినిమా లాంచింగ్ టైంలో టీజర్ ను విడుదల చేయనున్నాం” అని చిత్ర బృందం వెల్లడించింది. సినిమా లాంచింగ్ కు రెండు రోజుల ముందు టీజర్ రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments