'భరత్ అనే నేను'.. మే 4 నుంచి 'హోలీ' ఫైటింగ్ సీన్

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవ‌ల‌ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన‌ ఈ చిత్రంలో మహేశ్ ప్ర‌ద‌ర్శించిన‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మహేశ్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఓ యాక్షన్ సన్నివేశాన్ని జోడించాలని నిర్మాణ వర్గాలు నిశ్చయించుకున్నాయి. నిడివి కారణంగా ‘హోలీ’ పండుగ ఫైటింగ్ సీన్‌ను తొలగించినట్లు గతంలో దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే.. దాన్ని మళ్ళీ జోడించే అవకాశం కూడా ఉందని ఇటీవ‌ల దర్శకుడు తెలిపారు.  అన్నట్టుగానే ఆ ఫైటింగ్ సీన్‌ను త్వ‌ర‌లోనే సినిమాలో మ‌ళ్ళీ జోడించనున్నారు. అదనంగా జోడించిన ఈ కొత్త సీన్.. మే 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రానికి.. ఈ యాక్షన్ సన్నివేశం ఏ మేర హెల్ప్ అవుతుందో చూడాలి.